mt_logo

పోడు పట్టాల పండుగతో పాటు రైతుబంధు పథకం : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ :

జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా  పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింప చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా  ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా  రైతు బంధు పొందుతున్న వారితో పాటు  నూతనంగా  పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో ను క్రోడీకరించి ….రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబంధు అందుతున్నదో వీరికీ అదే పద్ధతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల  పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమ చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి…నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.  పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు. 

ఈ కారణంగా మంత్రి సత్యవతి రాథోఢ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంగళవారం సచివాలయంలో లో సీఎం కె. చంద్రశేఖర్ రావు గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.