mt_logo

నేడే పోడుకు ప‌ట్టాభిషేకం.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో ఆదివాసీల ద‌శాబ్దాల క‌ల సాకారం

  • కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో పోడు ప‌ట్టాలు
  • పంపిణీ చేయ‌నున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

జ‌ల్‌.. జంగ‌ల్‌..జ‌మీన్ అని భూ హ‌క్కుల కోసం పోరాడిన‌ గోండు వీరుడు కుమ్రంభీం గ‌డ్డ అది. ఆయ‌న స్ఫూర్తితో త‌మ భూమిపై త‌మ‌కు హ‌క్కుల కోసం ఆదివాసీ, గిరిజ‌న బిడ్డ‌లు దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. త‌మ అస్తిత్వం కోసం అలుపెర‌గ‌ని ఉద్య‌మాలు చేస్తూనే ఉన్నారు.. మావ నాటే.. మావ రాజ్ (మా తండాల్లో మా రాజ్యం), రిజ‌ర్వేష‌న్లు, పోడు భూముల‌కు ప‌ట్టాలు కావాలంటూ అధికారంలో ఉన్న పార్టీల‌ను వేడుకుంటూనే ఉన్నారు.. స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో వారి మొద‌టి రెండు క‌ల‌లు సాకార‌మ‌య్యాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ‌లోని ప్ర‌తి తండాను గ్రామ‌పంచాయ‌తీగా మార్చేసి వారి తండాల్లో వారి రాజ్యాన్ని సృష్టించారు. గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచి విద్యా, ఉద్యోగాల్లో వారి భాగ‌స్వామ్యాన్ని పెంచారు. ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన‌ మూడో క‌లనూ సాకారం చేస్తున్నారు. కొమురం భీం ఉద్య‌మించిన గ‌డ్డ‌పైనే జ‌మీన్ పోరాటానికి స్వ‌స్తి ప‌లుకుతూ పోడుకు ప‌ట్టాభిష‌కం చేస్తున్నారు. 4 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1.51 ల‌క్ష‌ల మందికి నేటినుంచి ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేయనున్నది.

కుమ్రంభీం పుట్టిన గడ్డ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల పట్టాల పంపిణీని శుక్రవారం ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల ‘పోడు’కల నేటితో నెరవేరనున్నది. దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల పైచిలుకు ఎకరాల భూమికి ఆదివాసీ, గిరిజ‌నుల‌ను హక్కుదారులను చేయనున్నారు. పోడు పంపిణీలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తర్వాత తెలంగాణ మూడోస్థానంలో సగర్వంగా నిలువబోతున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించాయి. 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 12,49,296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్‌ను వివిధ స్థాయిలో పరిశీలించి, 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాల భూమిపై 1,51,146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు.

ప‌క్కాగా అటవీ యాజమాన్య హక్కులు

‘భవిష్యత్తులో అటవీ భూమి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకూడదు. పోడుభూముల పట్టాల పంపిణీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నాం. అటవీ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు పోవాలి’ అని సీఎం కేసీఆర్‌ ఇటీవల సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు తీసుకొంటున్నారు. ఒకసారి భూ పంపిణీ చేసిన తరువాత అటవీ భూమి ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పాలిగన్‌ టెక్నాలజీ సహాయంతో పోడుభూముల పట్టాల (అటవీ భూ యాజమాన్య హక్కు ప్రతాలు)ను రూపొందించారు.

పాలిగ‌న్ టెక్నాల‌జీ అంటే?

భూమి సర్వే నంబర్‌, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ ఆకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్‌ మ్యాపింగ్‌ వివరాలతోపాటు హోలోగ్రామ్‌ను హక్కు పత్రంలో పొందుపరుస్తారు.

-దీంతో పంపిణీ చేసిన భూమి విషయంలో ఇరుగుపొరుగు వారితో సరిహద్దు వివాదాలు తలెత్తే అవకాశం లేదు.

-లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే కాలక్రమేణా సదరు భూమిని లబ్ధిదారుడు ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పాలిగన్‌ టెక్నాలజీని వినియోగించింది.

-అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాల్లో మూడు శాఖల అధికారులు, లబ్ధిదారుడి సంతకాలను పొందుపరిచారు.

-హక్కు పత్రాలపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకాలుండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది.

-లబ్ధిదారుని ఫొటోను సైతం ఇందులో పొందుపరిచారు. పంపిణీ చేసే పోడు భూములకు ఈ వానాకాలం పంట నుంచే రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

-దీంతో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరో 1,51,146 పెరగనున్నది. 4,06,369 ఎకరాలకు రైతుబంధు కింద ప్రభుత్వంపై ఏటా రూ.406.36 కోట్ల భారం పడనున్నది.

పోడులో మూడోస్థానం దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చాక (2016) ఏకకాలంలో నాలుగు లక్షల ఎకరాల పైచిలుకు భూములకు పట్టాలు పంపిణీ చేయటం అన్నది చరిత్ర. ఇప్పటివరకు తెలంగాణలో పంపిణీ చేసింది 3.08 లక్షల ఎకరాలే. మధ్యప్రదేశ్‌ ఇప్పటి వరకు 9.02 లక్షల ఎకరాలు పంపిణీ చేసి మొదటిస్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ 8.98 లక్షల ఎకరాలు పంపిణీ చేసి ద్వితీయ స్థానంలో ఉన్నది. వీటి తర్వాత తెలంగాణ 4,06,369 ఎకరాలను పంపిణీ చేసి మూడోస్థానంలో నిలవబోతున్నది. మొత్తంగా తెలంగాణ 7.14 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి మూడో స్థానంలో ఉండటం విశేషం.