mt_logo

కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో పీఎంవో రహస్య భేటీ ఆక్షేపణీయం : బోయినపల్లి వినోద్ కుమార్

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు రహస్యంగా సమావేశం కావడం ఆక్షేపనీయమని, అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. పీఎంవో తీరు దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, కేంద్ర ఎన్నికల కమిషన్ పై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ప్రతి సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న ఘనచరిత్ర కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉందని… అలాంటి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల్లో మోడీ సర్కార్ జోక్యం చేసుకోవడం మానుకోవాలని, లేదంటే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశాలకు గత 20 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను హాజరవుతున్నానని, అలాగే బీజేపీ నాయకులు కూడా హాజరై తమ విజ్ఞప్తులు తెలుపుకునే అవకాశం ఉందని, కానీ ఇలా రహస్య భేటీలు దేశానికి మాయని మచ్చను తీసుకువస్తాయని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *