సిద్దిపేటలోని తన నివాసంలో మహాత్మా జ్యోతిరావు ఫూలె 198వ జయంతి సందర్బంగా ఫూలె చిత్ర పటానికి పూలమాల వేసి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీనవర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకం అని అన్నారు.
సామాజిక దార్శనికుడుగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని పేర్కొన్నారు.
ఆయన ఆశయాలు, ఆశలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి పాలన కొనసాగించింది.. మహనీయులు డా. బీ ఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, బాబు జగ్జీవన్ రామ్ కన్న కలలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిజం చేశాం ఆని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయి అని హరీష్ తెలిపారు.
దళితబంధు, షెడ్యూల్డ్ కులాల తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి, పారిశ్రామికవేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు వంటి అనేక కార్యక్రమాలను, ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేకంగా అమలు చేశామని అన్నారు.
బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గీత, చేనేత, మత్స్యకార్మికులకు ప్రమాద బీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత్ విద్యుత్ ద్వారా నాయీ బ్రాహ్మణులకు చేయూత, రజకులకు ఆధునిక లాండ్రీ యంత్రాలు, దోభీ ఘాట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అమలు చేశామని గుర్తు చేశారు.. ఫూలే ఆశయ సాధన దిశగా మహిళలకు గురుకుల విద్యతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
వెనకబడినవర్గాల విద్యాభివృద్ధి కోసం మా బీఆర్ఎస్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసి, అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పాం. బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించి, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశాము.. బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేశాం అని తెలిపారు.
బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.. వృత్తులవారీగా ప్రోత్సాహకాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసాం. బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాం అని హరీష్ వివరించారు.