mt_logo

11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ!

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో సుమారు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికి హైదరాబాద్ ఫార్మా సిటీ అనే పేరును సీఎం సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సిటీని నిర్మిస్తామని, ఫార్మా యూనివర్సిటీని, ఫార్మా రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల, మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ లోని స్థలాలను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రెండు హెలికాప్టర్లలో సీఎం, అధికారుల బృందం, మరో రెండు హెలికాప్టర్లలో పారిశ్రామిక వేత్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఏరియల్ సర్వే అనంతరం సీఎం మాట్లాడుతూ, 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని నిర్మిస్తామని, దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, వీటివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు.

జీరో లిక్విడ్ డిశ్చార్జి వ్యవస్థతో ఈ సిటీ పనిచేస్తుందని, కాలుష్యం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు ఏరియల్ సర్వేలో పాల్గొన్న అనంతరం పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ముచ్చెర్ల శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉండటం, 11 నుండి 12 వేల ఎకరాల స్థలం ఫార్మాసిటీకి ఇవ్వడమే కాకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడం పట్ల వారికి పూర్తిస్థాయిలో నమ్మకం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *