
వలసల గోస అనుభవించిన ఉమ్మడి పాలమూరు జిల్లా దశాబ్దాల స్వప్నం సీఎం కేసీఆర్ సంకల్పంతో 70 ఏండ్ల తర్వాత సాకారమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కరువును శాశ్వతంగా తరిమికొట్టి పడావుపడ్డ భూములను పచ్చ మార్చేందుకు తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)ను నిర్మించింది. ఐదు భారీ రిజర్వాయర్లు… 145 మెగావాట్ల సామర్థ్యంగల మహాబలి మోటర్లు…భారీ టన్నెళ్లతో గుట్టలనే ఆనకట్టలుగా చేసుకొని ఇంజినీరింగ్ అద్భుతంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొన్నది. కృష్ణమ్మ జలాలను 240 మీటర్ల నుంచి 670 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేందుకు సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నమే చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందిన పీఆర్ఎల్ఐఎస్‌ను శనివారం సీఎం కేసీఆర్ నార్లాపూర్ వద్ద మోటర్ల స్విచ్ ఆన్ చేసి అట్టహాసంగా ప్రారంభించారు. కృష్ణమ్మ జలాలకు హారతిపట్టారు. కాగా, ఈ ప్రాజెక్టు దేశం దృష్టిని ఆకర్షించింది. శనివారం ఎక్స్ (ట్విట్టర్)లో పీఆర్ఎల్ఐఎస్ పథకంపై ట్వీట్ల వర్షం కురిసింది. రైతుల కన్నీళ్లను తుడిచేందుకు తెలంగాణ సర్కారు చేసిన సాహసయజ్ఞంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
దుమ్మురేపిన పాలమూరు హ్యాష్‌ట్యాగ్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్)లో #PALAMURURANGAREDDYPROJECT పేరుతో ట్వీట్లు చేయగా.. శనివారం దేశంలోనే టాప్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. 70 ఏండ్లలో సాధ్యం కాని పాలమూరు ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 7-8 ఏండ్లలోనే కట్టి చూపించారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికే గోదావరిని ఎదురెక్కించిన కేసీఆర్.. ఇప్పుడు కృష్ణమ్మనూ పొలాలకు బిరబిరా మళ్లించారని ప్రశంసించారు. నాడు పల్లె పల్లెనా పల్లేర్లు అని పాడుకొంటే.. నేడు కేసీఆర్ పుణ్యాన పల్లె పల్లెనా పచ్చని పంటలు అని పాడుకొనే సందర్భం వచ్చిందని మురిసిపోయారు. నాడు వలసల పాలమూరుకు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు వలసచ్చేలా చేసిన ఘనత తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సార్ మీరు చాలా గ్రేట్.. అద్భుతాలు చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు. కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కరువు గడ్డపై పాలనురుగల జలహేల.. అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైందని కొనియాడారు.