ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఎదురుదాడి చేయడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలను రంగంలోకి దింపింది. తెలంగాణ పోలీసులు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని, అసలు ఫోన్ ట్యాపింగ్ కు ఆస్కారమే లేదని తన నివేదికలో వివరించింది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడింది చంద్రబాబేనని, ఈ వ్యవహారంలో ఒక కేంద్రమంత్రి పాత్ర కూడా ఉందని తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ సహా ఇతర ప్రైవేట్ ఆపరేటర్లను ఐబీ విచారించి కాల్ డేటాను పరిశీలించింది. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ప్రకారం స్టీఫెన్ సన్ ఫోన్ నంబరుకు చంద్రబాబు ఇంటినుండే కాల్ వెళ్ళినట్లు కూడా ఇంటలిజెన్స్ బ్యూరో నిర్ధారించింది. ఏపీ మంత్రులు, చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఐబీ ఆరు నివేదికలు కేంద్రానికి సమర్పించింది.