mt_logo

బాబూ.. ఇక్కడ మేం క్షేమం

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు గారికి నమస్కారములతో రాయునది..

అయ్యా.. ఇక్కడ మేం క్షేమం. ఇక్కడ అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ.. మిగిలిన తెలంగాణ జిల్లాల్లోనూ పలు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న ఆంధ్రా నుంచి వచ్చిన వారమంతా బాగున్నాం. ఇక్కడ ఉంటున్న వారిలో కొందరి ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిందని, ఇక్కడి ఆంధ్రులు కలవరపడుతున్నారని మీరు ఆందోళన చెందుతున్నట్లుగా పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా తెలిసింది. మీరు మా గురించి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, మీకు మా గురించి ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని భావిస్తున్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ఉంటున్న ఆంధ్రులను కలవరపెట్టవద్దని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం.

శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటున్న రచయిత బమ్మిడి జగదీశ్వరరావు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాని, తెలంగాణ ప్రజల నుంచి కాని ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జీవిస్తున్నారని చెప్పడానికి మిక్కిలి సంతోషంగా ఉన్నది. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చిన మా మేనల్లుడు కూడా కూకట్‌పల్లిలో పరమానందభరితంగా బతుకుతున్నాడని, అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నాడని ఈ మధ్యనే విని ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్న బోళ్ల తాతాజీకి దిల్‌సుఖ్‌నగర్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ సోదరులు చేతనైన సాయం చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను.

భర్త అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో అద్దెకుంటున్న ఇంటి ముందే కర్రీ పాయింట్ పెట్టుకున్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సీతమ్మ చేసిన కూరలు, పచ్చళ్లంటే తెలంగాణ ఆడపడుచుల నోళ్లలో నీళ్లూరుతున్నాయని విని ఆ సీతమ్మకు బతుకు ధైర్యాన్ని ఇచ్చిన హైదరాబాద్‌కు, ఇక్కడి మనుషులకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఇలా వేలు, లక్షల మంది ఆంధ్రులు హైదరాబాద్‌లోనూ, తెలంగాణ జిల్లాల్లో నూ గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారని, ఈ మాట వింటే మీరు కూడా సంతోషిస్తారని భావిస్తూ మీకు తెలియజేస్తున్నాను.

అంతెందుకు.. హైదరాబాద్ శివారులో ఇల్లు కట్టుకున్న మీ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇంటి పై ఈగ కూడా వాలలేదనే విషయాన్ని నిరంతరం మీ పక్కనే ఉండే ఆయనే చెప్పలేదంటే కొంచెం బాధేస్తోంది. ఆయన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రి కాగానే పరకాల ప్రభాకర్ ఇల్లు ఉన్న గ్రామస్థులు మా ఊరమ్మాయి కేంద్రమంత్రి అయ్యిందంటూ పొంగిపోవడం పత్రికలు చూసిన వారందరికి తెలిసిందే. ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అమరావతి అభివృద్ధి పట్టించుకోకుండా ఇక్కడి ఆంధ్రుల జీవితాలపై ఆందోళన చెందవద్దని చెప్పేందుకే.

మీ రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఇల్లు ఇంకా ఆయన పేరు మీదే ఉందని, ఆయన ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి పేరు మీద మారలేదని, ఎప్పటికి మారదని గ్యారంటీ ఇస్తున్నా. తెలంగాణ వస్తే ఆయన ఇంటిని పని మనిషి లాక్కుంటుందేమోననే భయాన్ని ఏడాదిన్నర క్రితం ఓ ఛానెల్ చర్చాగోష్టిలో పాల్గొన్న బుచ్చయ్య చౌదరి గారు వ్యక్తం చేశారు. ఆయనకు, ఆయన ఇంటికి ఏం కాదని మీరు ధైర్యం చెప్తారని నేను ఆశిస్తున్నాను. మీ పార్టీ ఎంపీగారే చెప్పినట్లు ఏడాది పాలనలో కేసీఆర్ అనేకసార్లు పర్యటించింది నగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలోనే. అక్కడే ఆయన నిరుపేదలకు రెండు బెడ్‌రూంల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మీకు తెలియక కాదు కానీ, మల్కాజిగిరిలో ఉంటున్నవారిలో సగానికి పైగా ఉన్నవారందరూ ఆంధ్రులే. వాళ్లకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ అన్నారంటే మల్కాజిగిరి వాసుల గురించి తెలియక అనుకుంటామా..?

ఇక చివరిగా చెప్పొచ్చేదేమిటంటే మీ రాజకీయాలు, మీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓట్లు, నోట్లు, ప్రజాప్రతినిధుల అంకెల గారడీలు మీకే పరిమితం చేసుకోండని కోరుతున్నాను.

ఓట్ల పండుగ అయిపోయి ఏడాదైంది. మరో నాలుగేళ్ల వరకూ మా జోలికి రావద్దు మహాప్రభో అని ప్రార్థిస్తున్నాం. మార్నింగ్ వాక్‌లో ఎదురుపడినప్పుడు పరస్పర పలకరింపులు, అక్కడి వారి ఫంక్షన్లు, ఇక్కడి వారి ధావత్‌లు కలిసి చేసుకుంటున్న సమయంలో వాటి మధ్యలోకి ప్రాంతంపగ రావద్దని మనవి చేసుకుంటున్నా. రోజులు మారుతున్నప్పుడు మనుషులు మారతారని, కక్షలు, కార్పణ్యాలు కలకాలం ఉండవని, ఉండకూడదని ఆ దిశగా ఏలికలు పాలన సాగించాలని, వినకపోయినా చెప్పడం ఓ బాధ్యతగా భావించి ఈ నాలుగు ముక్కలు చెబుతున్న. కాపలా కాసే మనుషులను మార్చడం కంటే మీ చుట్టుపక్కల ఉన్నవారి మనసులు మారిస్తే బాగుంటుందని భావిస్తున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *