mt_logo

భువనైక సౌందర్యం – భువనగిరి

By: డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ

చారిత్రక ప్రాధాన్యమున్న భువనగిరి ప్రకృతి సౌందర్యానికి, సాహస కృత్యాలకు కూడా నెలవు. 600 అడుగుల ఎత్తున్న ఈ ఏకశిలా నగరిని ఎక్కితేనే మనకు ఈ అందాలన్నీ కనబడతాయి. హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో భువనగిరి పట్టణం మధ్యలో ఉన్న ఈ బృహత్ శిలపైనా అలాగే చుట్టుపక్కలా ఉన్న దర్శనీయ స్థలాలను చదివి వీక్షిస్తే అదొక అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతి.

దక్షిణ భారతదేశంలో దక్కను పీఠభూమి సహజమైన ఏకశిలా పర్వతాలకు ప్రత్యేక నిలయం. అలాంటి ఏకశిలా పర్వతాల్లో మైసూరు పీఠభూమి పైనున్న నందికొండ తర్వాత చెప్పుకోదగిన ఎత్తయిన పర్వతం భువనగిరి. ఈ తరువాత స్థానంలో పేర్కొనదైన వరంగల్‌లోని ఏకశిల ఏకంగా యావత్ తెలుగుదేశానికి 150 సంవత్సరాలు రాజధానిగా వర్ధిల్లింది. కానీ, దానికంటే ఏడు వందల సంవత్సరాల ముందు నుంచే భువనగిరి తెలుగు రాజ్యాల సైన్య క్షేత్రంగా సామంత రాజధానిగా వర్ధిల్లింది. పైగా క్రీ.శ. 1123 నాటికే తెలుగుదేశంలో పేరొందిన తీర్థక్షేత్రంగా కూడా వర్ధిల్లినట్లు భువనగిరిలోనే చాళుక్య రాజ్య సర్వసైన్యాధ్యక్షుడు కేశియ రసర్ అనే దండనాయకుడు వేయించిన శాసనం తెలుపుతున్నది. పేరొందిన తీర్థ క్షేత్రాలు సహజంగా అందమైన ప్రకృతిలో వర్ధిల్లుతాయి. భువనగిరిలోని అందమైన ప్రకృతిలో ఉన్న చారిత్రక నిర్మాణాలు భువనగిరికి సువర్ణానికి సువాసన అబ్బిన స్థితిని చేకూర్చాయి.

భువనగిరిలో దొరికిన 8 శాసనాలు విశదం చేసేదేమిటంటే భువనగిరి కోటను క్రీ.శ. 1100వ సంవత్సరం వరకే తెలంగాణలోని సామంతరాజులు నిర్మించారని, భువనగిరి ఒక తీర్థక్షేత్రం కూడా అని. ఈ కోట క్రీ.శ. 1163 వరకు కళ్యాణి చాళుక్యులకు, ఆ తర్వాత 1323 వరకు కాకతీయులకు సామంత రాజధానిగా మనుగడ సాగించింది. ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడుల నేపథ్యంలో కాకతీయ రాజ్య పతనంతో అతలాకుతలమైనా క్రీ.శ.1336 ప్రాంతంలో ముసునూరి నాయకుల ఏలుబడిలోకి వచ్చింది. కానీ, మళ్ళీ అనతికాలంలోనే దక్కన్‌లో ఏర్పడిన మరో ముస్లిం రాజ్య స్థాపకుడు బహమనీ షా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆయనకు, ముసునూరి కాపయ నాయకునికి మధ్య క్రీ.శ. 1350 ప్రాంతంలో కుదిరిన సంధిలో భువనగిరి ఉత్తర తెలంగాణ సరిహద్దుగా నిర్ణయించబడింది. అయితే, 20 సంవత్సరాలు తిరగక ముందే 1369లో భువనగిరిని రాచకొండ పద్మనాయక రాజు అనపోత నాయడు ఆక్రమించాడు. అప్పటి నుంచి సుమారు ఐదు దశాబ్దాలు ఆయన వారసుల పాలనలో కొనసాగింది. అందుకు నిదర్శనమైన ఒక శిలా శాసనం ఖాజీ ఇంటి దగ్గరే దొరికింది.

అది అనపోతన కొడుకు సింగమ నాయకుడు వేయించింది. క్రీ.శ. 1432లో మళ్ళీ బహమనీ సుల్తానుల (అహ్మద్ షా) ఆధీనంలోకి వెళ్ళి ఇక 5 శతాబ్దాలు పైబడి ముస్లింల పాలనలోనే ఉంది. బహమనీల వారసులు కుతుబ్షాహీలు, వారి తర్వాత వచ్చిన ముస్లిం రాజులు నిజాంలు. అయితే మధ్యమధ్యలో…. 15వ శతాబ్దారంభంలో కొంత కాలం విజయనగర రాజ్య సామంతుడు మాదయ ఇంగమ నాయకుడు, 16వ శతాబ్దారంభంలో కొంత కాలం సీతాపతి భానుడు, 18వ శతాబ్దారంభంలో కొంతకాలం సర్వాయి పాపన్న ఈ భువనగిరి కోటను ఆక్రమించి పాలించారని బి. రామరాజు రాశారు. చాళుక్యుల కాలంలో ఉచ్ఛస్థితిని అనుభవించిన భువనగిరి మరోసారి 16, 17 శతాబ్దాలలో కుతుబ్షాహీల ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నట్లు ఈ కొండమీదున్న చారిత్రక అవశేషాలు, ఆనాటి రచనల ద్వారా తెలుస్తున్నది. ఆ కాలపు గ్రంథాలైన తారీఖ్-ఇ-జఫరా, తథ్‌కిరా గోల్కొండ చుట్టూ భోన్‌గిర్, నార్కొండ, పటాన్‌చెరు, ఇబ్రహీంపట్నం మధ్యనున్న 500 మైళ్ళ వైశాల్యంలో పూలు, ఫలాలతో కళకళలాడే పచ్చదనం విస్తరించి ఉండేదని వర్ణించాయి.

కోటగోడలు, ప్రాంగణాలు: పట్టణం వైపున్న భువనగిరి గుట్ట పైకి ఏటవాలు స్థలం నుండి ఎక్కడం ప్రారంభిస్తే- ఓ వంద మెట్లు దాటాక కోట ద్వారం కుడివైపున- ఎడమ వైపున, కోట గోడ లోపల రాతిగుండ్ల సముదాయం కన్పిస్తుంది. ఈ గుండ్లల్లో ఒక ఇనుప ఫిరంగి కూరుకుపోతున్నది. ఫిరంగికి, కోట ద్వారానికి మధ్యలో నాలుగు గుండ్లు ఒక గుహను ఏర్పర్చాయి. అందులో ఒక రాయి ఉపరితలానికి ఒక వలయాల రేఖా చిత్రముంది. అడుగున్నర పొడవు, అడుగు వెడల్పు పరిమాణాలతో అండాకారంలో ఉన్న ఆ రేఖా చిత్రాన్ని (పెట్రోగ్లిఫ్) సుమారు మూడు వేల సంవత్సరాల కిందట ఇక్కడ నివసించిన బృహత్ శిలా యుగపు ప్రజలు విశ్వభువన భాండానికి-అంటే దేవునికి ప్రతిరూపంగా చిత్రించుకొని పూజించినట్లు తెలుస్తోంది.

ఈ రేఖా చిత్రపు గుండ్లనుండి కోట ద్వారంలోకి ప్రవేశించే ముందు కుడివైపుకు చూస్తే అల్లంత దూరంలో కోటగోడను ఆనుకొని మరికొన్ని గుండ్లు కన్పిస్తాయి. వాటికి ఆంజనేయుడు, వినాయకుని విగ్రహాలు చెక్కి ఉన్నాయి. భువనగిరిలో దొరికిన పద్మనాయక రాజు సింగమనాయకుని శాసనం, ఈ విగ్రహాల శిల్పరీతుల ఆధారంగా వాటిని క్రీ.శ.1369లో సింగమ తండ్రి అనపోత నాయుడు ఈ కోటను జయించిన సందర్భంగానో లేదా మరో 20 సంవత్సరాలకు ఇక్కడికి వచ్చిన సింగమ నాయుడో చెక్కించారని చెప్పవచ్చు.

ఈ విగ్రహాల వెనుక కోటగోడకు మరికొన్ని శిల్పాలున్నాయి. వాటిల్లో ముందుకాలు ఎత్తి లంఘిస్తున్నట్లు కన్పిస్తున్న సింహం శిల్పం క్రీ.శ. 4-6 శతాబ్దాల మధ్య తెలంగాణను పరిపాలించిన విష్ణుకుండి రాజుల అధికారిక చిహ్నాన్ని సూచిస్తుంది. విష్ణుకుండి వంశపు చివరి గొప్ప రాజు విక్రమేంద్ర భట్టారక వర్మకు సంబంధించిన నాణెం ఒకటి భువనగిరిపై దొరికింది. దీనిపైనున్న పీనుగుల దర్వాజా దగ్గర ఒక శిలా శాసనంలో కూడా విష్ణుకుండల కాలపు అక్షరాలున్నాయి. వీటన్నింటివల్ల భువనగిరి కోటను మొట్టమొదట విష్ణుకుండి రాజులు క్రీ.శ.4-6 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారని అర్థమవుతోంది.

కోట ప్రవేశద్వారం అన్ని కోటలలాగే మూడు మలుపులతో శత్రుదుర్భేద్యంగా, హుందాగా ఉంది. ఇరుకైన మెట్ల వరసలు అందంగా ఉన్నాయి. ఈ ద్వారానికి కొంతకాలం క్రితం వరకూ ఎత్తయిన చెక్క తలుపులు ఉండేవట. ఈ ద్వారం ఇప్పటికీ కొంతసేపు ఆగి చూడదగిన అందంతో అలరారుతున్నది. దీనిని ఆనుకొని కుడివైపు కోటగోడలు భువనగిరి మీదికి సాగుతున్నాయి. కోటగోడల వెంబడే విశాలమైన మెట్లున్నాయి. ఆ మెట్లనెక్కుతూ కిందివైపు నుండి వచ్చే గాలులను ఆస్వాదిస్తూ చుట్టూ ఆవరించి ఉన్న పట్టణం గుట్టలు, పచ్చని ప్రకృతి, పంట పొలాలు, చెరువులు చూస్తూ ముందుకు సాగాలి. కొంత దూరం తర్వాత మరో ప్రవేశద్వారం వస్తుంది. ఇది మొదటి ప్రవేశద్వారం కంటే మరింత ఉన్నతంగా ఉంది. దీన్ని చాళుక్యుల కాలం (క్రీ.శ.100 ప్రాంతం) తర్వాత 15, 16 శతాబ్దాల్లో బహమనీలు, కుతుబ్షాహీ రాజులు బాగా మరమ్మతు చేశారని, వారి వాస్తు శైలి పూర్వపు నిర్మాణాల మీద కన్పిస్తుంది. ఈ ద్వారంలో భాగంగానే రహస్య సొరంగ మార్గం కూడా ఉంది. అంతకు ముందున్న ప్రవేశద్వారం తూర్పువైపుకు ఉండగా దాన్ని మూసి వేశారు. దాని పక్కనే ఒక ఎత్తయిన వేదిక మీద ఒక పొడవైన ఫిరంగి ఉంది. 16వ శతాబ్దంలో కింది వైపు నుండి వచ్చే శత్రువులని పేల్చివేయడానికి ఈ ఫిరంగికి ఎడమవైపున మరో ఫిరంగి గద్దె ఉంది కాని, దానిమీది ఫిరంగి మాత్రం గుట్టకింది భాగంలో ఉన్న నీటి గుండంలో పడిపోయిందట.

ఈ రెండవ ప్రవేశద్వారాన్ని ఆనుకొని అనేక నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిల్లో అందమైన అండాకారపు రాతి కప్పుతో ఉన్న రెండు, మూడు గజాల పొడవైన జలకుండికలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఇంకా స్నానాల గదుల వంటి నిర్మాణాలున్నాయి. ఈ స్థలంలో కుతుబ్షాహీల కాలంలో ఫిరంగులను, వాటికి కావలసిన మందుగుండ్లను తయారు చేసిన రోళ్ళు, డాకళ్ళు మొదలైన ఆనవాళ్ళు కన్పిస్తున్నాయి. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న మడిగల వెనుక ఈ మధ్య కూడా పుట్‌బాల్ సైజులో ఉన్న ఒక ఇనుపగుండు దొరికిందని పర్యాటకులకు టిక్కెట్లిస్తున్న వినోద్ చెప్పాడు. ఆ ఇనుప గుండు కోట పైనున్న ఫిరంగుల్లో ఒక పెద్ద ఫిరంగి శత్రువుల పైకి పేల్చిందే కావచ్చునని భావిస్తున్నారు.

ఫిరంగులు: ఫిరంగి వేదికల వెనుక చిన్నపాటి మైదానముంది. అందులో ఒక పెద్ద వంటశాల, దానినానుకొని ధాన్యాగారాలున్నాయి. ఈ వంటశాల మీదా వైపు కూడా అనేక గదుల వరుసలున్నాయి. అవి సైనికుల ఆవాసాలో, అశ్వశాలలో లేక కార్యాలయ గదులో అయ్యుంటాయి. ఈ గదులు, వంటశాల మధ్య ఒక శిలా మంటపం ఉంది. దీని స్తంభాలు నాలుగూ శిల్పకళతో ఒప్పారుతున్నాయి. కానీ, అవి ఒక దేవాలయానివి కావు. ఒకే కాలానికి చెందినవీ కావు. అవన్నీ సుమారు తొమ్మిది వందల ఏళ్ళ కిందట చాళుక్యుల కాలంలో ఇక్కడ నిర్మించిన వివిధ ఆలయాలకు చెందినవిగా చెబుతున్నారు. అయితే, వాటిని 14, 15 శతాబ్దాలలో బహమనీ వంశానికి చెందిన ముస్లిం రాజులు ధ్వంసం చేశారు. మూడున్నర దశాబ్దాల కింద సినీ హీరో కృష్టంరాజుపై ఇక్కడే చిలకా గోరింక అనే సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు చుట్టుపక్కల పడి ఉన్న ఆలయ స్తంభాలను ఒకచోట మండపం లాగా నిలబెట్టి వాటి మధ్యలో ఆంజనేయుని విగ్రహాన్ని పెట్టి చిత్రీకరణ చేసుకున్నారట.

ఈ మంటపం నుండి ముందుకు సాగితే కుడివైపు కొండ అంచు, దానికింద గుండం అగాథంగా కన్పిస్తాయి. ఆ కొండ అంచున కూర్చుంటే కింద నుంచి రివ్వున వస్తున్న చల్లగాలులు మన ముంగుర్లు రేపుతూ ఆహ్లాదాన్నిస్తాయి. ఈ కొండంచు వెంబడే గజమెత్తు మట్టిగడ్డ విశాలంగా కన్పిస్తుంది. ఆ మట్టిని ఏ వెయ్యేండ్ల కిందనో కింద నుంచి తెచ్చి ఆయా కట్టడాల నిర్మాణంలో వాడారు. కొంత మట్టినేమో పూలు, పళ్ళు, కూరగాయలు పండించడానికి ఉపయోగించారు. ఆ మట్టిలో అనేక చారిత్రక అవశేషాలు దొరికే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాబట్టి, రాష్ట్ర పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టడం అవసరం.

సప్తగుండాలు: ఈ రాతి మెట్లకు సమాంతరంగా కొండ మధ్యలో ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా సాగుతున్న ఏటవాలులో ఏడు నీటి గుండాలు ఏర్పడ్డాయి. వాటిని సప్తగుండాలు అని, ఏడు కన్యకల బావులు అని పిలుస్తున్నారు. నిజానికి అవి బావుల పరిమాణంలో కాకుండా కుంటల పరిమాణాల్లో ఉన్నాయి. వాటి నుండి ఒక్క నీటి చుక్క కూడా కిందికి వృధాగా జారిపోకుండా డంగు సున్నంతో కలిపిన రాతి నిర్మాణాలు ఉన్నాయి. వర్షాకాలంలో కొండపై నుంచి జాలువారిన నీటితో నిండిన గుండాలు ఎండాకాలంలో కొండపై నున్న ప్రజలకు ఉపయోగమయ్యేలా ఉన్నాయి. ఆ గుండాలను ఆనుకునే ప్రజలు, సైనికుల నివాస స్థానాలు, ఆలయాలు ఉండేవని చెప్పడానికి అక్కడ వాటి పునాదులు కన్పిస్తున్నాయి.

భువనగిరిలో దొరికిన శాసనాల ప్రకారం ఇదొక తీర్థక్షేత్రం అనడానికి కారణం ఈ అరుదైన అందమైన నీటి గుండాలే. కిందికి పోతున్న కొద్దీ ఈ నీటి గుండాల పరిమాణాలు, లోతు పెరుగుతూ పోయాయి. పూర్తిగా కింది వైపునున్న ఆరవ, ఏడవ గుండాలనైతే ప్రత్యేకంగా నిర్మించారు. వాటి మధ్య ఆనకట్ట కట్టారు. ఆ కట్టకు ఇరువైపులా గుండాల్లోకి మెట్లు కట్టారు. మెట్లకు సమాంతరంగా నీటి మట్టాలను తెలుసుకొనే రంధ్రాలు తొలిచారు. సుమారు అడుగు దూరం ఎడంతో, సుమారు 60 నుంచి 100 అడుగుల లోతున్న ఈ గుండాలు ఒకనాడు ఈతకు అనువుగా ఉండేవి. ఈనాడేమో చిన్నచిన్న పెడల్ బోట్లు తిప్పడానికి అనువుగా ఉన్నాయి. కేవలం ఆనకట్టను నీరు జారిపోకుండా మరమ్మత్తు చేస్తే చాలు, మరింత ఆనందాన్ని మన సొంతం చేసుకోవచ్చు.

అన్నింటి కన్నా పైనున్న గుండం నుండి ఎడమమైపుకి సాగితే కోటపై భాగానికి చేరుకుంటాం. కుడివైపుకి సాగితే చెరువుకుంటకు చేరుకుంటాం. మూడు తంతెలుగా ఉన్న భువనగిరి కొండ మొదటి తంతె కింది పాదభాగంలో ఉన్న ఈ కుంట చాలా అందమైంది, అరుదైంది. నిజంగానే ఒక చిన్నపాటి చెరువంత విశాలంగా ఉంది. ఎండాకాలంలో కూడా దానిలో నీళ్ళు ఎండిపోవడం లేదు. పైగా అంతు తెలియనంత లోతుగా ఉంది. ఈ చెరువు మీదుగా భైరవ శిల్పం చెక్కి ఉంది. దాన్ని క్రీ.శ. 1369లో పద్మనాయకరాజు అనపోతా నాయుడు చెక్కించాడు. భువనగిరిపై తన విజయానికి గుర్తుగా ఈ కుంట చుట్టూ అనేక రోలు గుంటలు, కుండలు, పెంకులు కన్పిస్తున్నాయి. ఇవి ఒకప్పటి ప్రజల నివాసాన్ని, మందుగుండు సామాగ్రి తయారు చేసిన కర్మాగారపు ఆనవాళ్ళను తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ ఈ చెరువుకుంట వెనుకవున్న కోట గోడనానుకొని ఉన్న రాతి గుండ్లల్లో ఆనాడు (16వ శతాబ్దంలో) ఇక్కడే తయారైన ఫిరంగి కన్పిస్తుంది.

చెరువులు, కుంటలు: ఈ ఫిరంగి ఉన్న రాతి గుండ్లు మొదలుకొని భువనగిరి ఉపరితలం చుట్టూ విశాలమైన కోటగోడను ప్రహరీగా చేయడానికి వీలుగా కట్టారు. కొండ అంచును పరివేష్టితమై ఈ గోడ ఉంది. గోడ కింద కొండ నిటారుగా, జారుడుగా ఉంది. కాబట్టి, కింది నుంచి శత్రువులు ఎవరూ ఈ కొండను ఎక్కే సాహసమూ చేయలేరు. చేసినా వారిని అప్పుడే అక్కడే ఎదుర్కొనే విధంగా గోడల్లో నుండి తుపాకులు పేల్చేందుకు, మసలే నూనెను పోసేందుకు వీలుగా రంధ్రాలున్నాయి. చెరువుకుంట దగ్గరి ఈ కోట గోడమీది నుంచి కుడివైపుకు చూస్తే మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేనేమి చెరువు అనే ఒక పెద్ద చెరువు కన్పిస్తుంది. దాన్ని భువనగిరి పర్యాటకుల కోసం బోటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. తేనేమి చెరువుకు, వరంగల్ వెళ్ళే రహదారికి మధ్య కొచ్చె గుట్టలున్నాయి. ఆ గుట్టల్లో ఒక ప్రాచీన శివాలయం బ్రహ్మాండమైన ముఖమండపంతో ఉండగా సమీపపు మరో గుట్టపై వీరభద్రాలయముంది. ఈ ఆలయాలను పునరుద్ధరిస్తే చరిత్ర, భక్తి, ట్రెక్కింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్లకు ఎంతో సంబురంగా ఉంటుంది.

కొచ్చెగుట్టల పక్క నుంచి వెళ్తున్న వరంగల్ రహదారికి ఎడమవైపున రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కొంత భూమి సేకరించింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనున్న ఆ ప్రాంతం నుండి భువనగిరిపైకి రోప్‌వే నిర్మించి, అక్కడి నుండి రోప్‌వే బకెట్లలో పర్యాటకులను చేరవేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. రోప్‌వే నిర్మాణ స్థలానికి వెనుక, ఎడమవైపున అమ్మకుంట అనే చెరువుంది. ఈ అమ్మకుంట, తేనేమి చెరువుల పేర్లు 8, 9 శతాబ్దాల్లో ఇక్కడ మనుగడలో ఉన్న జైన మతస్థుల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాయి.

కోటగోడ అంచుల వెంట: అమ్మకుంటను చూశాక కోటగోడ మీదుగా ముందుకు సాగుతూ ఉంటే కొంచెం దూరంలో ఆ కోటగోడ ఉత్తరపు కొస నుంచి మనం మళ్ళీ దక్షిణం వైపుకు తిరిగే విధంగా మలుపు తీసుకుంది. ఈ ప్రాంతం చాలా థ్రిల్లింగ్‌గా నిజం చెప్పాలంటే ఒకింత భయంకరంగా, ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా ఉంది. 550 అడుగుల ఎత్తునున్న కోట బురుజుల కింది భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడ అందాలను, పాములాగా వంకరలు తిరుగుతూ సాగిపోతున్న రైళ్ళ సోయగాలను, మరికొన్ని కిలోమీటర్ల దూరంలో కనిస్తున్న యాదాద్రి క్షేత్రాన్ని ఈ కోట మలుపు నుండి చూడటం మరిచిపోలేని మధురానుభూతి.

రాణుల స్నానఘట్టాలు: భువనగిరికి పడమటి వైపున్న ఈ కోట బురుజులను కొండ శిఖర స్థలానికి మధ్యనున్న ఖాళీ స్థలంలో మరో రెండు విశాలమైన కోనేరుల వంటి నీటి గుండాలున్నాయి. వీటిని రాణి వాసపు స్త్రీలే వాడినట్లు తెలిపే స్నానపు గద్దెలు, సమీపపు పూల వనాలు, పక్కనున్న నంది, ఆంజనేయ విగ్రహాలు తెలియజేస్తున్నాయి. మరో గుండంలో చెత్తా చెదారం పడకుండా దానిపైన పందిరి వేశారని తెలిపే పునాది రంధ్రాలు కన్పిస్తున్నాయి. ఈ గుండాల నుండి పూల వనాలకు నీటిని మోటల ద్వారా సరఫరా చేశారని తెలిపే ఆనవాళ్ళు కూడా కన్పిస్తున్నాయి. గుండం ఒడ్డునున్న ఆంజనేయ విగ్రహాన్ని కొండకే తొలిచారు. పద్మనాయకరాజు అనపోతనాయుడు ఆరున్నర శతాబ్దాల కింద ఈ భువనగిరిని జయించినప్పుడు కోటను అష్ట దిగ్బంధనం చేయడంలో భాగంగా చెక్కించిన ఆంజనేయ విగ్రహాల్లో ఇది ఒకటని తెలుస్తోంది.

ఏనుగుల బావి: ఆంజనేయ విగ్రహం నుంచి ముందుకు సాగితే కొండ దక్షిణపు చివరను చేరుకుంటున్న మార్గంలో మనకు మరో రెండు నీటి గుండాలు కన్పిస్తాయి. ఇవి కూడా విశాలమైనవే. చిట్టచివరి గుండాన్ని ఏనుగుల బావి అని పిలుస్తారు. ఈ బావి లోతు కూడా తెలియదట. లోతైన బావి కాబట్టే అందులో నీళ్ళు పచ్చగా ఉన్నాయి. కాని ఒకప్పుడు దీనిలోని నీటిని ఏనుగుల సహాయంతో శుభ్రం చేయించేవారట. భువనగిరి కొండ అగ్రభాగాన ఉన్న రాజ భవనంలోకి ఈ బావి నుండే నీటిని పైపుల ద్వారా సరఫరా చేసేవారు. రాజ భవనం కంటే కొంచెం ఎత్తయిన గోడలు (ఆర్చీలు) కట్టి, వాటి మీదున్న కుళాయిలోకి ఏనుగుల ద్వారా మోటతో నీటిని నింపి, అక్కడి నుండి పైపుల ద్వారా రాజభవనం గోడలను ఆనుకొని ఉన్న కుండీలలోకి, స్నానాల గదుల్లోకి నీటిని సరఫరా చేసిన ఆధారాలు ఇప్పటికీ కన్పిస్తున్నాయి. ఈ ఏనుగుల మోట ఒక అద్భుత దృశ్యం.

రాజభవనం, ఫౌంటెయిన్: ఏనుగుల బావి దగ్గర నుండి చుట్టూ విస్తరించిన భువనగిరి పట్టణం కన్పిస్తుంది. బావి నుండి ఎడమవైపుకు వెళ్తే ఒక విశాలమైన ఎత్తయిన వేదిక కనిపిస్తుంది. అది సుమారు చదరంగా ఉంది. దాన్ని ఎక్కడానికి ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆరేసి మెట్లున్నాయి. మెట్లెక్కగానే మనల్ని అమితంగా ఆకర్షించేది దీర్ఘచతురస్రాకారంలో ఉన్న జలకుండం. 4 గజాల వెడల్పు, 8 గజాల పొడవుతో గజంనర లోతుతో నిర్మించిన ఈ కుండం 4 అంచులను నాలుగే రాళ్ళతో ఎలా అంత అందంగా మలిచారో మనకర్థం కాదు. మొత్తమ్మీద జలకుండం కుతుబ్షాహీల కాలంలో ఫౌంటేయిన్‌గా ఉండి ఉంటుంది.

నిజానికి ఈ ఫౌంటేయిన్ రాజభవనం పశ్చిమపు ఆవరణలో ఉంది. దీని తరువాత తూర్పువైపు మూడు ఆవరణలు ఒక్కొక్కటి మూడేసి విశాలమైన గదులతో నిర్మించబడ్డాయి. ఒకప్పుడు పడమటి ఆవరణలో కూడా మూడు గదులున్నట్లు భావిస్తే ఈ భవనంలో మొత్తం పన్నెండు గదులుండేవన్నమాట. ఇస్లామిక్ వాస్తులో ఇలాంటి నిర్మాణాన్ని బారాదరి అంటారు. బారాదరి సాధారణంగా కోట శిఖరాగ్ర స్థానంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది.

నిర్మాణ వైచిత్రం: పడమటి ఆవరణ తరువాత ఆవరణ మొదలుకొని తూర్పు ఆవరణ వరకు ప్రతి గదిగోడ పునాది స్థలంలో మూడు గజాల పొడవు, గజం వెడల్పు, గజం లోతుతో ఉన్న భూగర్భ కుండీలు ఉన్నాయి. అంటే ప్రతి గదిలోనూ మంచినీటి వసతి ఉండేదన్న మాట. ఇలాంటి కుండీలలోకి ఏనుగుల బావి నుండి పైపుల కనెక్షన్ ఉంది. ఈశాన్యం వైపు గదిలో కుండీలకు నీరు బయటకు వెళ్ళే మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవి మరుగుదొడ్లు అయ్యుంటాయి. ఈ కుండీలన్నింటి మీద వేసిన రాతి పైకప్పు శిల్పకాళా శోభితంగా ఉంది.

పడమటి ఆవరణ నుండి తూర్పువైపు- ఆవరణ వైపు వెళ్తున్నకొద్దీ నిర్మాణాలు వాటి వైచిత్య్రం పెరుగుతూ పోయింది. రెండవ ఆవరణలో రాజసం ఉట్టిపడేలా రెండువైపులా రెండేసి పొడవాటి స్తంభాలున్నాయి. ఆ స్తంభాలను ఆనుకొని ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఉన్న గదుల మీద 12 గజాల పొడవైన ఒక కర్రతో చేసిన దూలాలున్నాయి. ఇప్పటికీ అంటే అయిదారు శతాబ్దాలు గడిచిన తరువాత కూడా అవి చెక్కు చెదరలేదు.

అలంకరణలు: పడమటి ఆవరణలో గోడల కింది నుంచి పైవరకు డంగు సున్నంతో చేసిన అలంకరణలుండగా తూర్పువైపు ఉన్న రెండు ఆవరణల్లోని ఆరు గదుల గోడలు అన్నీ గూళ్లతో అలంకరించబడ్డాయి. అరంగుళం మందమున్న చెక్కలను అరడుగు, అడుగు పరిమాణాల్లో గూళ్లుగా చేసి, వాటిపైన రెండు మిల్లీమీటర్ల మందంతో డంగు సున్నం పూసి అనేక అలంకరణలను రూపొందించడం అద్భుతంగా కన్పిస్తుంది. మెత్తటి దుబ్బ, ఒండ్రు మట్టిని సున్నంతో కలిపి అందులో కోడిగుడ్ల సొన కొట్టిపోసి తయారుచేసిన మిశ్రమంతో ఆ గూళ్లకు పూత పూయడం వల్ల అవి అత్యంత నునుపుగా, పోత పోసినట్టుగా అందంగా కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ గూళ్ళకు పసుపురంగు పూయడం వల్ల వాటి అందం మరింత ఇనుమడించింది.

భవనపు తూర్పు ఆవరణలోని మధ్య గది మరీ అందమైంది. ఇది రాజుకు కేటాయించిందై ఉంటుంది. ఆ గది నుండి ముందు (తూర్పు) వైపుకు అర్ధచంద్రాకారంలో ఒక బాల్కనీ ఉంది. బహుశా కుతుబ్షాహీ సుల్తాన్ (రాజు) సైనికులకు ఆజ్ఞలు ఇవ్వడానికి గానీ, ప్రజలకు ఝరోకా దర్శనమిచ్చి వారి సమస్యలు వినడానికి గాని ఈ బాల్కనీ ఉపయోగపడి ఉంటుంది.

భవనం కింద ఉన్న ఆర్చి గదులు అశ్వశాలలుగా, సైనిక గృహాలుగా ఉపయోగపడి ఉంటాయి. ఒకప్పుడు ఈ భవనం నలుమూలలా నాలుగు గద్దెలపై ఫిరంగులుండేవట. ఇప్పుడు మాత్రం ఆగ్నేయం వైపున్న గద్దెమీద మాత్రమే ఒక ఫిరంగి ఉంది. ఇప్పుడు ఈ భవనం చుట్టుపక్కల టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ వారు మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. అందులో దక్షిణం వైపున్న బిల్డింగ్‌ను గెస్ట్‌హౌజ్‌గా, రెస్టారెంట్‌గా వాడుకోవచ్చు.

రాజభవనం నుండి కిందికి దిగి వస్తున్నప్పుడు రెండవ కోటద్వారం నుంచి నేరుగా కాకుండా కుడివైపుకు తిరిగి ముందుకు సాగితే చాళుక్యుల కాలం నాటి కోటగోడలు, దర్వాజాలు, వారికంటే ముందు కాలపు కట్టడాలు కూడా కన్పిస్తాయి. ఈ ప్రాంతాన్ని పీనుగుల దిబ్బ అంటారు. ఇక్కడి దర్వాజాలో నాలుగు శిలాశాసనాల రాళ్ళు పొదిగి ఉన్నాయి. ఈ కోటగోడ ముగిసే దాకా ముందుకు సాగితే అక్కడ మరో చిన్న దర్వాజా ఉంది. ఆ దర్వాజాకు ఇరువైపులా ఉన్న ద్వార పాలకుల విగ్రహాలను పూర్తిగా చెక్కివేశారు. ఇక దర్వాజాపై గడప పైనున్న గజలక్ష్మి విగ్రహానికి ఇరువైపులా ఏనుగులు తమ తొండాలతో అభిషేకం చేస్తున్నట్లున్న శిల్పం చాలా అందంగా ఉంది. ఈ పీనుగుల దిబ్బ ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపితే మరిన్ని చారిత్రక విశేషాలు వెలుగు చూసే అవకాశమున్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

స్థల మహత్యం: రాష్ట్ర రాజధానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో, అదీ ప్రధాన రహదారి మీద ఉండటంతో భువనగిరిలో పర్యాటక రంగ అభివృద్ధికి చాలామంచి అవకాశాలే ఉన్నాయి. సాహసిక పర్యటనతో పాటు చారిత్రక పర్యటనలు, ఎకో టూరిజానికి కూడా భువనగిరి అనుకూలంగా ఉంది. దీని చుట్టుపక్కల కేవలం 25 కిలోమీటర్ల పరిధిలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో భారతదేశపు ప్రసిద్ధ క్షేత్రాల నిలయమైన సురేంద్రపురి 7 కిలోమీటర్లు, యాదగిరి 10 కిలోమీటర్లు, కొలనుపాక జైన దేవాలయం, పెంబర్తి ఇత్తడి హస్తకళా కేంద్రం 25 కిలోమీటర్ల దూరాల్లోనే ఉన్నాయి. భువనగిరి చుట్టు పక్కల్లో కొచ్చే గుట్టల్లో ఉన్న దేవాలయాలు, ఏనెలు అనే నగిరి పర్యాటక కేంద్ర ప్రాధాన్యాలను మరింత పెంచుతాయి.

ఆధునిక యుగంలో భువనగిరి తెలంగాణ చరిత్రలో చోటు సంపాదించుకున్న గొప్ప నాయకులను అందించింది. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భూదానోద్యమానికి తొలి ఊపిరినిచ్చిన భూదాన్ రామచంద్రారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిష్టర్‌గా సేవలందించిన ఎలిమినేటి మాధవరెడ్డి భువనగిరి బిడ్డలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరెస్ట్ శిఖరాన్ని అతిచిన్న వయసులోనే అధిరోహించి రాష్ర్టానికి పేరు తెచ్చిన మాలావత్ పూర్ణ, ఆనంద్‌లకు వారి గురువు బిజినేపల్లి శేఖర్‌బాబు శిక్షనిచ్చింది ఈ భువనగిరిలోనే. ఇంతటి ప్రాధాన్యం కలిగి, రాష్ట్ర రాజధాని నగరం (హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోకి కూడా చేరిపోయి 163వ నంబర్ జాతీయ రహదారి మీద ఉంది కాబట్టే భువనగిరిని అడ్వెంచర్, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదెంతైనా అభినందనీయం.

పర్యాటక భువనం
భువనగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కింది అవకాశాలను పరిశీలించవచ్చు.

– భువనగిరి పైనున్న సప్తగుండాల్లోని మొదటి రెండు గుండాలను (ప్రవేశ మార్గం దగ్గరున్న వాటిని), చెరువుకుంటను పునరుద్ధరించి వాటిలో చిన్న పెడల్ బోట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.

– అమ్మకుంటను, తేనేమి చెరువును బోటింగ్ పాయింట్లుగా అభివృద్ధి చేయవచ్చు.

– చెరువుకుంట దగ్గరికి రోప్‌వే నిర్మించి, అక్కడి నుండి కోటగోడ వెంట బురుజులు, నీటి గుండాలను చూస్తూ రాజభవనం చుట్టూ తిరిగేలా వాకింగ్ ఎస్కలేటర్ ఏర్పాటు చేసుకోవచ్చు.

– ఆంజనేయస్వామి గుడికి ఉత్తరాన ఉన్న నీటి గుండాన్ని శుభ్రం చేసి, దాని వెనుక ఉన్న స్క్రీన్ వంటి బండకు సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ గుండంలోకి పై నుండి వచ్చే జలపాతం కిందివైపుకు కూడా జలపాతంగా దూకుతుంది కాబట్టి ఈ గుండంలోని నీటినే రొటేట్ చేస్తూ ఎప్పుడూ కనిపించే జలపాతం లాగా చేసి దానిపై నుండి కొండపైనున్న రాజభవనం దగ్గరకు చేరుకునేలా ఎస్కలేటర్ ఏర్పాటు చేసుకుంటే ఎంతో బాగుంటుంది.

– సప్తగుండాలు, రాణి గుండాలకు పక్కనున్న మట్టి మేటలపై ప్రాచీన కాలపు పూల వనాలను పెంచాలి. నిజాం కాలపు తమలపాకుల తోటలను పునరుద్ధరించుకోవచ్చు.

– భువనగిరి చుట్టూ పడిపోయిన ఫిరంగులను, నల్గొండ పోలీస్‌స్టేషన్ ముందు పెట్టిన ఇక్కడి ఫిరంగులను ఒక చోటకు చేర్చి ఈ కోట ప్రాంగణంలో ప్రదర్శనకు పెట్టుకోవచ్చు.

-భువనగిరి పైనున్న మట్టి మేటల్లో, పీనుగుల దిబ్బలో, కొండ కిందున్న కోటగోడల్లో, కందకాల్లో తవ్వకాలు చేపట్టి, చారిత్రక అవశేషాలను వెలికి తీసి ఒక సైట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

– కొచ్చెగుట్టల్లో ఉన్న ఆలయాల వద్దకు ట్రెక్కింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయవచ్చు. ఏనె గుట్టల్లో కూడా అడ్వెంచర్ టూర్లను, పక్కనే ఉన్న పాండవుల గుహలను, రెండెకరాల వైశాల్యంలో విస్తరించిన మర్రిచెట్టును ఎకో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు.

– వేయేళ్ళ కిందటి సోమేశ్వరాలయాన్ని, భోనేశ్వరాలయాన్ని పునరుద్ధరించి ఆధ్యాత్మిక శోభను పెంచవచ్చు.

– భువనగిరి కొండ ఉత్తర పాదంలో అమ్మకుంట దగ్గర లేక్ వ్యూ గెస్ట్‌హౌజ్‌లు, రెస్టారెంట్స్ నిర్మించుకోవచ్చు. ఇవి రోప్‌వే కేంద్రానికి కూడా దగ్గరగా ఉంటాయి. ఇలా భువనగిరిని అద్వితీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *