తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో తుదివిడత చర్చ ఈ రోజు నుంచీ జరగనుంది. సభ్యుల అభిప్రాయాల సేకరణ 23వ తేదీలోపు స్వీకరించి తుది నివేదికను కేంద్రానికి పంపడానికి అసెంబ్లీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. జనవరి 10నాటికే సభ్యుల అభిప్రాయాలు స్పీకర్ కు రాతపూర్వకంగా అందజేయడం జరిగింది. కాగా గడువు పెంచాలని సభ్యులు కోరడం వట్టి వాదనేనని, ఇంకా చర్చించడానికి కొత్తగా ఏమీ లేదని, బిల్లుపై సవరణలకు అసెంబ్లీకి ఎలాంటి అధికారంలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే. మహంతి స్పష్టం చేసినట్లు సమాచారం. 42రోజుల సమయాన్ని కేటాయిస్తూ రాష్ట్రపతి తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపిన తరుణంలో ఇంకా బిల్లుపై చర్చకు గడువు అవసరం లేదని, 23 అర్ధరాత్రి వరకైనా సభను నడిపించి బిల్లును కేంద్రానికి పంపడానికి స్పీకర్, రాష్ట్రప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. 21వ తేదీన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రపతిని గడువు పెంచమని కోరే అధికారం ముఖ్యమంత్రికి గానీ, స్పీకర్ కు గానీ లేదని, ముఖ్యమంత్రి గడువు పెంచమంటూ స్పీకర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ పంపించనున్నట్లు సీమాంధ్ర నేతలు చేస్తున్న అసత్య ప్రచారం ఎవరూ నమ్మవద్దని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల 23వ తారీఖు వరకు వీలైనంత ఎక్కువమంది సభ్యులు చర్చలో పాల్గొనే అవకాశం ఉందని, రాత్రి వరకూ కూడా సమావేశాలు జరిగేటట్లు స్పీకర్ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. రాతపూర్వకంగా ఇచ్చిన సమాచారాన్నే సభ్యుల అభిప్రాయంగా తీసుకోనున్నట్లు, ప్రత్యేకించి చర్చలో పాల్గొనకపోయినా ఏమీ కాదని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ బిల్లుపై చర్చ సాధ్యమైనంత త్వరగా ముగించి కేంద్రానికి పంపుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.