mt_logo

వాటర్ గ్రిడ్ పనుల నాణ్యతలో రాజీపడొద్దు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యత విషయంలో రాజీపడొద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. వాటర్ గ్రిడ్ పథకంపై మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్ బీ, రైల్వే, జాతీయ రహదారులు, పంచాయితీ రాజ్, ట్రాన్స్కో, నీటిపారుదల శాఖ అధికారులతో బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారని, 2019 ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని పూర్తిచేసి, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించిన తర్వాతే ఓట్లు అడుగుతామనే ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్ కు మంచినీరు సరఫరా చేసే గోదావరి జలాల పైప్ లైన్ ద్వారా వచ్చే ఏప్రిల్ చివరినాటికి మెదక్ జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, వరంగల్ జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు తాగునీరు అందించాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో బస్సుయాత్ర ద్వారా జిల్లాల్లో పర్యటిస్తానని, అప్పుడు వాటర్ గ్రిడ్ పనులను స్వయంగా పరిశీలిస్తానని సీఎం చెప్పారు. పైపులైన్లు వేయడానికి రైట్ ఆఫ్ వే చట్టాన్ని అనుసరించి ఆరు అడుగుల లోతున పైప్ లైన్లు వేయాలని, ఎవరి భూములనుండైనా వేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లాలో వేసే పైప్ లైన్ తన వ్యవసాయ క్షేత్రం నుండి పోతున్నదని, చట్టానికి ముఖ్యమంత్రి సహా ఎవరూ అతీతులు కారని కేసీఆర్ స్పష్టం చేశారు.

సమీక్షా సమావేశం అనంతరం ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఎన్నికలలోపు వాటర్ గ్రిడ్ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతోందని, ఈ పథకాన్ని రానున్న రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. పనులు సకాలంలో పూర్తికావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, పైప్ లైన్లు అత్యధిక భాగం రోడ్ల వెంబడే వేస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల రైతుల భూములనుండి వెళ్తున్నాయని, ఇందుకోసం రైట్ ఆఫ్ వే చట్టాన్ని ఉపయోగించుకుంటామని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *