mt_logo

గర్వంతో విర్రవీగకండి.. తగ్గి ఉండండి- సీఎం కేసీఆర్

వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ తో పాటు ఆ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ విజయం చరిత్ర సృష్టించింది.. అలాగే వరంగల్ ప్రజలు అత్యంత మెజార్టీ ఇచ్చి మనకు మరింత బాధ్యత అప్పగించారు. ప్రభుత్వాన్ని దీవించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు.. అందుకే వారి సమస్యలు ఓపికగా విని పరిష్కరించాలి. అసహనానికి గురికాకుండా శాంతంగా ఉండి సంయమనం పాటించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గర్వంతో విర్రవీగకుండా వీలైనంత తగ్గి ఉండాలని వారికి సూచించారు. చాలా చిన్న కార్యకర్త అయిన పసునూరి దయాకర్ కు అవకాశం వచ్చినట్లే, పార్టీని నమ్మిన ప్రతి ఒక్కరికి తప్పకుండా అవకాశం వస్తుందని, అయితే కార్యకర్తలు తమవంతు వచ్చేవరకు ఓపిక పట్టాలని సీఎం వారిని కోరారు. వరంగల్ లో అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేసిన వారందరికీ పేరుపేరునా సీఎం ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కావాలి.. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు రక్షణ కవచంలా నిలవాలని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సీఎం అన్నారు. వరంగల్ ప్రజలు ప్రభుత్వాన్ని దీవించి బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోవాలని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని, ఈ విజయంతో గర్వానికి పోకుండా బాధ్యతగా తీసుకుని ప్రజలతో మరింతగా మమేకం కావాలని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి మొదటినుండి వరంగల్ జిల్లా ప్రజలు అండగా ఉన్నారని, 35 లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహించి వరంగల్ ప్రజలు అద్భుతం సృష్టించారని గుర్తుచేశారు. జిల్లాలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, వరంగల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, కార్యకర్తలు వాటిని ప్రజల్లోకి చేరేలా చూడాలని సీఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *