mt_logo

నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకున్న మిషన్ భగీరథ

తెలంగాణ రాష్ట్ర పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం అద్భుతమంటూ నీతి ఆయోగ్ కితాబునిచ్చింది. ఈ మేరకు కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా మిషన్ భగీరథను కొనియాడారు. “మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఇండ్ల‌కు తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే” అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 56.06 లక్షల ఇండ్ల‌కు మిషన్ భగీరథ పథకం కింద నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తూ, వంద శాతం తాగు నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ విశిష్టతను పొందింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు హర్యానా 30.97 లక్షల ఇండ్ల‌కు, గోవా 2.63 లక్షల ఇండ్ల‌కు, పుదుచ్చేరి 1.15 లక్షల ఇండ్ల‌కు తాగు నీటిని అందిస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని కేంద్ర నీతి ఆయోగ్ పేర్కొంది.

రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు హ‌ర్షం :

కేంద్ర నీతి ఆయోగ్ రాష్ట్ర మిషన్ భగీరథ పథకానికి కితాబును ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షకు ఈ ప‌థ‌కం నిదర్శనం అని వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు వినోద్ కుమార్ కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రీ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *