విభజన హామీలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు మరొకసారి అబద్ధాలే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చామని, ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయంటూ బొంకింది. ఆ మిగిలిన హామీలకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని హామీలపై తెలంగాణకు చెందిన ఎంపీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏపీకి చెందని కే శ్రీనివాస్, కే రామ్మోహన్‌నాయుడు, వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు బదులుగా నిత్యానందరాయ్ ఈ సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలను వాటి సహకారంతోనే పరిష్కరిస్తామని, తాము కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తామని చెప్పారు. ఈ చట్టలపై ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించామని, చాలా హామీలను నెరవేర్చామని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
విభజన హామీలన్నీ నెరవేరాయా?
ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలోని హామీలను కేంద్రంలోని బీజేపీ సర్కారు నెరవేరుస్తుందని తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారు. కానీ.. ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా మోదీ సర్కారు మోసం చేసింది. ఈ తొమ్మిదేండ్లలో విభజన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేదు. పారిశ్రామిక రాయితీల సంగతి పూర్తిగా మరిచిపోయింది. లక్షలాది తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. దేశవ్యాప్తంగా 22 సాప్ట్‌వేర్ పార్కులు ప్రకటించి తెలంగాణకు మొండిచేయి చూపింది. దేశవ్యాప్తంగా వందలాది మెడికల్ కాలేజీలు, పదుల సంఖ్యలో ఐఐఎంలు, ట్రిపుల్ ఐటీలు, నవోదయ పాఠశాలలు ప్రకటించిన మోదీ సర్కారు ఒక్క విద్యా సంస్థను కూడా తెలంగాణకు కేటాయించలేదు. ఏపీలో అక్రమంగా కలిపిన తెలంగాణ గ్రామాలపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఇప్పుడు సాక్షాత్తూ లోక్‌సభలో విభజన హామీలన్నీ నెరవేర్చామని కేంద్రమంత్రి నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేయడంతో తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. అవాస్తవాలు, అసత్యాలతో ఇంకెన్నిరోజులు తమను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.