mt_logo

ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వనన్న రేవంత్.. ఇంటింటికి తిరిగి కండువాలు కప్పుతున్నాడు: నిరంజన్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు. లోక్‌సభ ఎన్నికలు నా పాలనకు రెఫరెండం అన్న రేవంత్ మాటకు దిక్కు లేదు అని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యంపై కాంగ్రెస్ అధిష్టానమే కమిటీ వేసింది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును సరిదిద్దుకోలేవు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వను అన్న రేవంత్.. ఇంటింటికి తిరిగి కండువాలు కప్పుతున్నాడు అని విమర్శించారు.

వైఎస్ హయాంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు.. కానీ తెలంగాణను ఆపలేకపోయాడు. తెలంగాణ అనేది నిరంతర జ్వాల.. దానిని నిరంతరం కాపాడుకుంటాం. తెలంగాణ తెచ్చిన పార్టీగా, పదేళ్లు గొప్పగా పాలించిన పార్టీగా నిరంతరం పోరాడతాం అని స్పష్టం చేశారు.

నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చగలం అనుకుంటే పొరపాటు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుతోనే సాధ్యం.. అవి సాధ్యంకాని హామీలు కాబట్టి మీరు విజయవంతం కాలేరు. రాష్ట్రంలో రెండు నెలలుగా ఫించన్లు ఇవ్వడం లేదు.. రైతుబంధు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు. కోరి తెచ్చుకున్న మొగడు కొట్టినా పడాలి, తిట్టినా పడాలి అన్నట్లు పరిస్థితి ఉంది అని దుయ్యబట్టారు.

రైతుభరోసా సంగతి దేవుడెరుగు.. రైతుబంధుకే దిక్కు లేదు. రుణమాఫీకి సంబంధించి రూ.19 వేల కోట్లకు రూ.14 వేల కోట్లు ఇచ్చాం. ఎన్నికల నాటికి మిగిలిపోయిన రైతాంగానికి రుణమాఫీ చేస్తారా? చేయరా? ప్రకటించండి. రూ. 2 లక్షల రుణం కావాలంటే రైతుకు ఖచ్చితంగా 5 ఎకరాల నుండి 10 ఎకరాలు ఉండాలి.. కోటి 33 లక్షల ఎకరాలు 5 ఎకరాల లోపు రైతుల చేతిలో ఉంది అని నిరంజన్ రెడ్డి అన్నారు.

గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణాల వివరాలు ప్రకటించాలి. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ రూ. 2 లక్షల రుణాలు లేవు.. ఈ విషయం బ్యాంకు అధికారులే చెబుతున్నారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తారా? కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు? వారికి రూ. 15 వేలు ఇస్తారా? వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తారా? ఇప్పటికే రెండు పంటలు పోయాయి. వడ్లకు బోనస్ నమ్మలేదు కానీ రైతుభరోసా ఇస్తారని నమ్మి మోసపోయాం అని రైతులు చెబుతున్నారు అని తెలిపారు.

మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 ఏమయ్యాయి? ఎన్నికల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పారు.. ఇప్పుడు రేషన్ కార్డులన్ని రద్దు చేసి పథకాలను కుదించే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదు అని జయప్రకాష్ నారాయణ చెప్పారు.. అధికారం వచ్చాక కూడా చెప్పారు అని అన్నారు.

రుణమాఫీపై క్యాబినెట్ నిర్ణయం మీద గ్రామాల్లో పాలాభిషేకాలు, సంబరాలు చేయడం సిగ్గుచేటు. రుణమాఫీ వ్యవహారం సినిమా లెక్క ఉంది.. ఆడియో రిలీజ్, ఫస్ట్ పిక్, ప్రీమియర్ షో, రిలీజ్ షో లెక్క ఉంది. మేం నోరు కట్టుకుంటే రుణమాఫీ ఒక లెక్కనా అని అపహాస్యం చేశారు. రుణమాఫీ చేయకుండానే సంబరాలు చేయడం దారుణం అని
దుయ్యబట్టారు.

బాధ్యత వహించే, ఘనత వహించే మీడియా ఏం చేస్తుంది.. ఇదే కేసీఆర్ హయాంలో జరిగి ఉంటే ఆ మీడియా ఊరుకునేదా? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పది పూర్తైతే రూ. 10 వేలు, ఇంటర్ పూర్తయితే రూ. 15 వేలు, డిగ్రీ పూర్తయితే రూ. 25 వేలు, పీజీ పూర్తయితే రూ. లక్ష, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేస్తే రూ. 5 లక్షలు అన్నారు.. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఇచ్చారా? అని అడిగారు.

ఎదుగుతున్న యువతరాన్ని గొప్పగా వంచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్ల క్రితం జూన్ 25న ఈ రోజు ఎమర్జన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగాన్ని కాలరాసిన పార్టీ కాంగ్రెస్. దళితబంధు వంటి మంచి పథకాన్ని కాంగ్రెస్, బీజేపీలు అపహాస్యం చేశాయి. అంబేద్కర్ పేరు మీద కాంగ్రెస్ రూ. 12 లక్షలు ఇస్తాం అన్నారు.. ఏడు నెలలలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా… రాష్ట్రంలోని మేధావులు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మోడీ దెబ్బకు చతికిలబడింది.. చివరలో రాహుల్ పాదయాత్రతో కొంచెం లేచి నిలబడింది. దేశ జనాభా రెండుగా చీలిన కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యం వహించింది. బీజేపీ గెలుపుకు బీఅర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి సిగ్గుండాలి అని విమర్శించారు.

రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో బీజేపీకి లీడ్ వచ్చింది. తెలంగాణలో బీజేపీకి అధిక స్థానాలు రావడంపై ఏఐసీసీ కమిటీలు వేసింది.. బీజేపీని నిలువరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా పుంజుకుంటుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు.