By: కట్టా శేఖర్‌రెడ్డి
విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే తెలంగాణ ఎంత సమున్నతంగా నిలబడగలదో ఆనాడే ఎలుగెత్తి చాటింది నమస్తే తెలంగాణ. విభజన సమయంలో, ఎన్నికల సమయంలో, విభజన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియా చేయని కుట్రలు లేవు, రాయని రాతలు లేవు.
వాళ్లే పక్కనే ఉన్న కర్ణాటకకు ఫార్మా పరిశ్రమలు తరలిపోనున్నాయని రాస్తే, అది ఎంత అబద్ధమో తేల్చి చెప్పి పటాపంచలు చేసింది నమస్తే తెలంగాణ. వాళ్లు శ్రీశైలం ఎడమగట్టు కూడా ఆంధ్రకే చెందుతుందని రాస్తే అది ఎంత పచ్చి అబద్ధమో ఆధార సహితంగా రాసి చెంప చెళ్లుమనిపించింది నమస్తే తెలంగాణ. తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు తప్పుడు రాతలు, వక్రీకకరణలు చేస్తున్న ఆంధ్ర మీడియాను ఒంటిచేత్తో తూర్పారబడుతున్నది నమస్తే తెలంగాణ.
నిజమే.. నమస్తే తెలంగాణ పక్షపాతం వహించే మాట వాస్తవం. నమస్తే తెలంగాణ పక్షపాతి. తెలంగాణ ఉద్యమ పక్షపాతి. తెలంగాణ ప్రజాస్వామిక రాజకీయాల పక్షపాతి. తెలంగాణ కోసం అంకితమైన రాజకీయశక్తుల పక్షపాతి. తెలంగాణ దుఃఖం తన దుఃఖంగా భావించింది. తెలంగాణ బాధలు తన బాధలుగా భరించింది. తెలంగాణ ధర్మాగ్రహాన్ని తన ఆగ్రహంగా మల్చుకుంది. తెలంగాణ ద్రోహులకు కాలిలో ముల్లు, కంఠంలో గరళమైంది. తెలంగాణ అస్థిత్వ ఉద్యమానికి వ్యతిరేకంగా ద్రోహులు చేసే కుతర్కాలు, వితర్కాల పాలిట పాశుపతాస్త్రమైంది. తెలంగాణకు ఎవరు బంధువులో, ఎవరు రాబందువులో గుర్తుపట్టేట్టు చేసింది. ఏవి తెలంగాణ వార్తలో ఏవి వ్యతిరేక వార్తలో తెలుసుకునే చైతన్యాన్ని పంచింది.
ఇంతకాలం తెలంగాణ ప్రజల మెదళ్లపై స్వారీ చేసిన పత్రికల రంగు, రుచి, రూపం బట్టబయలు చేసింది. తెలంగాణ రాదు. వచ్చినా విఫలమవుతుంది. అప్పుల పాలవుతుంది. ఆగమవుతుంది. మీకు పాలించుకోవడం చేతకాదు. మీకు కష్టపడి పనిచేయడం తెలియదు. మీ ప్రాంతంలో పన్నులు కట్టరు. మీ వాళ్లు సోమరిపోతులు అని ప్రచారం చేసిన ఆంధ్ర దురహంకార మీడియా ముక్కుదూలాలు బద్దలుకొడుతూ తెలంగాణ నిలుస్తుంది, గెలుస్తుంది, సమున్నత పతాకాలను ఎగరేస్తుంది. తెలంగాణ సంపన్న రాష్ట్రం. పేద రాష్ట్రం కాదు. పేదరికంలోకి నెట్టబడిన రాష్ట్రం. తెలంగాణ అదనపు సంపదను కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టారు. పాలనలో, నాయకత్వ పటిమలో, దీక్షాదక్షతల్లో తెలంగాణ ఆంధ్ర నాయకత్వానికంటే ముందున్నది. తెలంగాణ విజయం సాధిస్తుంది అని నిత్యం మంత్రం పఠించిన పత్రిక నమస్తే తెలంగాణ. వాళ్లు మనకు గోతులు తీయాలని చూస్తే, నమస్తే తెలంగాణ ఆ గోతులపై వంతెనలు పరుచుకుంటూ వెళ్లింది. నమస్తే తెలంగాణకు ఇంతటి మనో ధైర్యాన్ని, ఆత్మిక బలాన్ని ఇచ్చింది నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు.
వాళ్లు(ఆంధ్ర మీడియా) నై తెలంగాణ అంటే నమస్తే జై తెలంగాణ అన్నది. వాళ్లు తెలంగాణ ఇక రానట్టే అంటే నమస్తే కొట్లాడి సాధించుకుంటాం అని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుల కరవాలమైంది. తెలంగాణకు జరిగిన అన్యాయాలను విప్పి చెప్పే కరదీపిక అయింది. వాళ్లు ఉద్యమానికి, నాయకులకు వంకలు పెడుతుంటే, నమస్తే తెలంగాణ మన నాయకులకు హారతులు పట్టింది. వాళ్లు ద్రోహులను కూడగట్టి, వారి వార్తలను పతాక శీర్షికల్లో పెట్టి ఉద్యమాన్ని ఆగం పట్టించాలని చూస్తే నమస్తే తెలంగాణ అటువంటి శక్తులను చీల్చి చెండాడి ఉద్యమశ్రేణులకు సరైన మార్గదర్శనం చేసింది.
వాళ్లు కిరాయి కోటిగాళ్లను కేసీఆర్‌పైకి ఎగదోసినప్పుడల్లా ఆ కోటిగాళ్ల నిజస్వరూపాలను తెలంగాణ ప్రజలకు విప్పి చెప్పి, ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. వాళ్లు హైదరాబాద్ యూటీ అవుతుందోచ్ అని చంకలు గుద్దు కుంటూ వార్తలు రాస్తే అదెంత బోగసో బట్టబయలు చేసింది నమస్తే తెలంగాణ. హైదరాబాద్ గవర్నర్ పాలనలో పెడతారని ఊదరగొడితే అది ఎలా సాధ్యం కాదో చాటి చెప్పింది నమస్తే తెలంగాణ. విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే తెలంగాణ ఎంత సమున్నతంగా నిలబడగలదో ఆనాడే ఎలుగెత్తి చాటింది నమస్తే తెలంగాణ.
విభజన సమయంలో, ఎన్నికల సమయంలో, విభజన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర మీడియా చేయని కుట్రలు లేవు, రాయని రాతలు లేవు. వాళ్లే పక్కనే ఉన్న కర్ణాటకకు ఫార్మా పరిశ్రమలు తరలిపోనున్నాయని రాస్తే, అది ఎంత అబద్ధమో తేల్చిచెప్పి పటాపంచలు చేసింది నమస్తే తెలంగాణ. వాళ్లు శ్రీశైలం ఎడమగట్టు కూడా ఆంధ్రకే చెందుతుందని రాస్తే అది ఎంత పచ్చి అబద్ధమో ఆధార సహితంగా రాసి చెంప చెళ్లుమనిపించింది నమస్తే తెలంగాణ. తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు తప్పుడు రాతలు, వక్రీకకరణలు చేస్తున్న ఆంధ్ర మీడియాను ఒంటిచేత్తో తూర్పారబడుతున్నది నమస్తే తెలంగాణ.
నాలుగేళ్ల క్రితం నమస్తే తెలంగాణ పుట్టిన రోజున చాలా మాటలు విన్నాం. మఘలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు. వాళ్ల ముఖం వాళ్లే నడుపుతారన్నారు. తెలంగాణ వాళ్లకు పత్రికలు నడపడం చేతకాదన్నారు. మూన్నాళ్లకే మూతపడుతుంది చూడు అన్నారు. ఇవన్నీ ఆంధ్ర పత్రికా యాజమాన్యాల దురహంకార ఆలోచనల నుంచి జనించినవి. తాము తప్ప ఎవరూ ఏమీ చేయలేరన్న ఆధిపత్య భావన నుంచి పుట్టినవి. కానీ వాళ్లు తప్పని, వాళ్లను దాటుకుని ఐదో సంవత్సరంలోకి సమున్నతంగా ముందుకు వెళుతున్నామని ఈరోజు సగర్వంగా ప్రకటించుకుంటున్నాం. కేసీఆర్, దామోదర్‌రావు, సీఎల్ రాజం అనేక కష్టనష్టాలకోర్చి తెలంగాణకు అందించిన గొప్ప ఆయుధం నమస్తే తెలంగాణ.
తెలంగాణ కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రల మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నప్పుడు తెలంగాణకు అందించిన మనోధైర్యమే నమస్తే తెలంగాణ. తెలంగాణలో ఇప్పటికీ చాలా మందికి అవేవో ఆంధ్రా పత్రికలు నిష్పక్షపాత పత్రికలని, నమస్తే తెలంగాణ రాజకీయ పత్రిక అని భ్రమలు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న పత్రికలు లేవు. పచ్చ రంగు లేక మరో రంగు పూసుకోని పత్రికలు ఏవీ లేవు. నమస్తే తెలంగాణ తెలంగాణ రంగు పూసుకుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడేవారు ఏ పార్టీ అయినా నెత్తికెత్తుకుంటుంది. ఆంధ్ర ఆధిపత్యశక్తులకు ఏజెంట్లుగా మాట్లాడేవారిని చీల్చి చెండాడుతుంది. ప్రాప్తకాలజ్ఞత లేనివాడిని ఎవరయినా ఈసడించుకుంటారు.
తెలంగాణ వచ్చి సరిగ్గా ఏడాది. దేశంలో ఏ రాష్ట్ర విభజన జరుగని విధంగా అనేక మెలికలు పెట్టి రాష్ట్రాన్ని విభజించారు. ఇంకా సిబ్బంది విభజన జరగలేదు. దాదాపు రెండు వందల ప్రభుత్వ సంస్థల విభజన కుంటినడకన జరుగుతున్నది. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించడానికి ఏడు మాసాలు పట్టింది. హైకోర్టు విభజన జరుగలేదు. చంద్రబాబు ఇప్పటికీ అవరోధాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇన్ని ఇబ్బందులున్నా తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే తాను ఏమి చేయగలదో, ఎలా ప్రజల పక్షం వహించగలదో రుజువు చేసుకుంది. అయినా ప్రతిపక్షం కాబట్టి వంకరగానే మాట్లాడాలని భావించే వారిని, అయినదానికి కానిదానికి తొలి తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేవారిని తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న వారిగా ఎలా నమ్మడం? అందుకే నమస్తే తెలంగాణ అటువంటి వారికి దూరం పాటిస్తున్నది. నమస్తే తెలంగాణ తెలంగాణ పక్షం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ఛత్రం.
చంద్రబాబు స్వయంకృతాలు..
చంద్రబాబునాయుడు ఇవ్వాళ ఉన్న దుస్థితికి తప్పు ఆయనదే. ఆయన ఇప్పటికీ కొన్ని వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణకు ఆయనకు సంబంధం లేదని ప్రజలు స్పష్టంగానే చెప్పారు. హైదరాబాద్‌లో పది సీట్లు గెలవొచ్చుగాక, ఆయన తెలంగాణతో సంబద్ధతను కోల్పోయారు. తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు వేరువేరు. నిత్యం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇక్కడేదో భవిష్యత్తులో తిరిగి పట్టాభిషేకం చేసుకుందామని ఆలోచించడం తెలివితక్కువతనమయినా కావాలి.. అతితెలివయినా కావాలి. ఇందులో అత్యాశ కూడా ఉండవచ్చు.
అంతేకాదు తెలంగాణను ఇంకా కంట్రోలు చేయాలనుకోవడం, కేసీఆర్ తనకంటే తక్కువ అనుకోవడం, తెలంగాణ ఉన్నతిని చూసి అసూయపడడం, రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత కూడా నిరంతరం నష్టాల గురించి ఏడవడం ఆయన స్థాయిని దిగజార్చుతున్నాయి. అసూయ మనిషిని కుంగదీస్తుంది. తగులబెడుతుంది. పాజిటివ్ ఆలోచనలను చంపేసి, నెగెటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తుంది. చంద్రబాబు ఇప్పటికీ అసూయతో రగిలిపోతున్నాడు. హైదరాబాద్‌ను వదులుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.
సుసంపన్నమైన తెలంగాణను వదులుకోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఇప్పటికీ విభజన నష్టాలను గురించే పలవరిస్తున్నాడు. ఆయన కుంగిపోవడమే కాదు. ఆంధ్ర ప్రజలను కూడా కుంగదీస్తున్నాడు. ఈ అసూయతోనే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య అక్షరాలా నిజమనిపిస్తున్నది. ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా రెండు రాష్ట్రాల నేతల ఉపన్యాసాలు పోల్చి చూడండి.
కేసీఆర్ ఈ ఏడాదిలో ఏం చేశారో, తదుపరి కాలంలో ఏం చేయబోతున్నారో చెప్పారు. ఆవిర్భావదినాన్ని ఉత్సవంలా సంబురంలా నిర్వహించారు. తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. అదే చంద్రబాబు అక్కడ అక్కసు వెళ్లగక్కారు. విభజించి పాపం చేశారని కాంగ్రెస్‌ను తిట్టిపోశారు. రాజధాని లేకుండా చేసి వీధుల్లో పడేశారని రాగాలు తీశారు. తాను తీవ్ర మనోవ్యాకులతకు గురయి, మొత్తం ప్రజానీకాన్ని వ్యాకుల పరిచారు. పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్‌కు ఈ రెండు సన్నివేశాలు ప్రబల ఉదాహరణలు.
చాలా బాధ కలుగుతున్నది. ఈయన ఏమి నాయకుడండి? ప్రజలకు మనోధైర్యాన్ని చెప్పాల్సిందిపోయి అస్తమానం ఈ ఏడుపు ఏమిటండి? ఇంకా ఎంతకాలం ఇది? అయినా ఆంధ్రకు ఏమి తక్కువని. చరిత్ర లేదా? సంస్కృతి లేదా? దేశంలోనే అతిపెద్ద కోస్తా తీరం. అన్నపూర్ణవంటి గోదావరి, కృష్ణా డెల్టాలు. తెలంగాణ, ఆంధ్రల మధ్య ద్వేషాలను సజీవంగా ఉంచి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నడు తప్ప మరోటి కాదు. గత ఏడాది కాలంలో అన్నీ మాట తప్పడమే. ఒకటి చెబుతాడు. మరొకటి చేస్తాడు. తెలంగాణకు మంచి నాయకుడు దొరికాడు. మా ఖర్మకు దివాళాకోరు దొరికాడు. విజయవాడ, గుంటూరుల్లో ఆయన ఉండడానికి ఇల్లే దొరకలేదా? ఒక్కటి ఆలోచించండి.
ఆయన ఇక్కడే వచ్చి ఓ ఇల్లు తీసుకుని రాజధాని నిర్మాణం ప్రారంభించి, ఇక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచుతూ వడివడిగా పనులు చేస్తూ పోతే ఎంత బాగుంటుంది. కేంద్రం ఇప్పటివరకు 2200 కోట్ల దాకా ఇచ్చింది. ఇంకా సాయం అందిస్తూనే ఉంది. పది దాకా జాతీయ పరిశోధన, విద్యా సంస్థలు ప్రారంభించింది. కేంద్రం మోసం చేసిందని ఇక్కడ పోస్టర్లు వేయిస్తాడు. ఆంధ్రకు మేలు చేస్తున్నాడో కీడు చేస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. అంతా మా ఖర్మ అని గుంటూరు జిల్లాకు చెందిన సీనియరు రాజకీయ విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త చెప్పారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు గెల్చుకోవడానికి ఆయన చేసిన తప్పిదాలు ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.
మాకు ఖర్చు చేయడానికి ఆయన తీవ్ర నొప్పులు పడుతుంటాడు. ఎమ్మెల్యేను కొనడానికి కోట్లు ఎలా వచ్చాయి? అని రాజధాని ప్రాంత పౌరుడొకరు వేసిన ప్రశ్నకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు. అసూయతో నిండిన మనసులో దృష్టంతా పక్కోని ఉన్నతిపై ఉంటుంది. ఆత్మతృప్తితో పనిచేసుకుపోయేవాడి దృష్టి సారించి ప్రగతిపైన, నడవాల్సిన దూరంపైన ఉంటుంది. చంద్రబాబుకు, కేసీఆర్‌కు తేడా అదే.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..