By: సవాల్‌రెడ్డి
అధర్మం పెచ్చరిల్లినప్పుడు దేవుడు మాత్రం ఎంతవరకు సహిస్తాడు చెప్పండి? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో ఇదే జరిగింది. ఎపుడో 18 ఏండ్ల క్రితం అవినీతికి ఇంతకాలం తర్వాత శిక్ష విధిస్తారా? అని కొంతమంది నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే ఏమిటి?.. అందుకే ఆలస్యమైనా పాపం పండుతుందని పెద్దలు అనేది!. ఇవీ గత సెప్టెంబర్‌లో జయలలిత జైలుకు వెళ్లినపుడు రాధాకృష్ణ కొత్తపలుకులో రాసిన ఆణిముత్యాలు. అందులో అధర్మాన్ని దేవుడు కూడా సహించడని చెప్పాడు. పాపం ఎప్పటికైనా పండుతుందని చెప్పాడు. అదే రాధాకృష్ణ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఏం రాస్తున్నాడు? అవినీతి మన జీవితంలో ఒక భాగమైపోయింది. రాజకీయాల్లో నీతి, నైతికత వెతకబోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. అని.. అంటే రాధాకృష్ణ దృష్టిలో జయలలిత పట్టుబడితే పాపం పండినట్టు. అదే రేవంత్ దొరికితే కుట్రలు చేసినట్టు. పైగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు పెడితే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని కేసీఆర్ భావిస్తే ఈ ఉదంతం కాస్తా టీ కప్పులో తుఫానులా తేలిపోవచ్చు అని సిగ్గులేకుండా కొత్తపలుకులు పలుకుతున్నాడు. అంటే పట్టపగలు రెడ్ హ్యండెడ్‌గా దొరికిన వాడిని వదిలేయాలని సలహాలు చెప్తున్నాడు. సిగ్గు అనే పదం కూడా సిగ్గుతో చచ్చిపోతుంది!
దబాయింపు రాతలు..!
దాగబోయి దాగబోయి తలారి ఇంట్లో దూరినట్టు ఓటుకు నోటు కేసులో రేవంత్ ఏసీబీకే అడ్డంగా దొరికిపోయాడు. అయినా పచ్చమూక దబాయించి బయటపడాలని చూస్తున్నది. ఉమ్మడి పాలనలో నిర్మాత మీద కాల్పులు జరిపినా మసిపూసి మారేడు కాయ చేసినట్టు ఇపుడు కూడా బయట పడవచ్చుననుకుంటున్నది. ఎదుటివాళ్లు ఏ చిన్న తప్పు చేసినా మీడియా మాఫియాతో నానాయాగీ చేయించి ఆగమాగం చేసే పచ్చమూక ఇవాళ పట్టపగలు జరిగిన దారుణాలను కప్పిపుచ్చాలని భావిస్తున్నది. రాధాకృష్ణలాంటి వంతగాళ్లు ఆ కుట్రను అమలు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి వీడియోలో టీఆర్‌ఎస్ నాయకులు పట్టుబడి ఉంటే ఇదే రాధాకృష్ణ ఏం చేసి ఉండే వాడు? గతంలో కేటీఆర్‌తో ఫోటో దిగిన వ్యక్తి ఒకరు సెటిల్‌మెంట్ ఉదంతంలో పట్టుబడితే దాన్ని కేటీఆర్‌కు అంటగడుతూ ఎన్ని కథనాలు రాశాడు. ఎంత రచ్చ చేశాడు? ఇవాళ ఏకంగా చంద్రబాబే దొరికిపోతే ఎంత నిర్లజ్జగా సమర్థిస్తున్నాడు. రాజ్యసభ సభ్యత్వం కోసం ఇంత దిగజారాలా?
దొంగతనానికి లైసెన్సు ఉందా?..
ఉమ్మడి రాజధాని అట. ఫోన్ ట్యాపింగ్ అట. రాజ్యాంగమట. హక్కులట. డబ్బుల మూటలు విరజిమ్మి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవచ్చని విభజన చట్టం ఏమన్నా ప్రత్యేక హక్కులు ఇచ్చిందా? లేక రెడ్‌లైట్ ఏరియాలో వ్యభిచారానికి లైసెన్సు ఇచ్చినట్టు ఉమ్మడి రాజధానిలో ఏ వెధవ పనైనా చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏమన్నా లైసెన్సు తీసుకున్నదా? ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ విరుద్ధమట. మరి తెలంగాణ సచివాలయం ఫైళ్లలో ఉండాల్సిన మెట్రో రైల్ ఉత్తర ప్రత్యుత్తరాల లేఖలు కొట్టేయడం రాజ్యాంగబద్ధమా? తెలంగాణ ప్రభుత్వం రూపొందించే ప్రతి పథకం సాప్ట్ కాపీలు నేరుగా ఏపీ సచివాలయానికి చేరడం రాజ్యాంగబద్ధమా? అధికార రహస్య పత్రాల తస్కరణ కేసు పెడితే ఏపీ సచివాలయంలో ఎందరు మిగులుతారు? ఏపీ ప్రభుత్వ సలహాదారు దానికి సిద్ధమా? గవర్నర్ బంగళాలో రాధాకృష్ణ కెమెరాలు రాజ్యాంగబద్ధమా? అంబటి రాంబాబు లాంటి వాళ్ల ఫోన్లను ట్యాప్ చేయడం ఆడవాళ్లతో హస్కీ గొంతులతో ఉచ్చులు బిగించడం నేరం కాదా? విదురుడి మేనమామ ధర్మపన్నాలు చెప్తున్నాడు.
మళ్లీ అదే తీరు..
ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకున్నదట… ఓ వైపు రేవంత్ వీడియోలు.. చంద్రబాబు సంభాషణల టేపులు అన్ని పత్రికలు టీవీల్లో ఊదరగొడుతుంటే రాధాకృష్ణ మీడియా మాత్రం కేటీఆర్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయాడోచ్ అంటూ ఓ కథ అల్లేశాడు. ఓ టేప్‌ను ప్రదర్శించి చంకలు గుద్దుకున్నాడు. రేవంత్ కేసులో స్టీఫెన్‌సన్ ఫిర్యాదు ఉంది. వీడియో సాక్ష్యం ఉంది. పట్టుబడ్డ డబ్బుమూటలు ఉన్నాయి. బ్యాంకులో లావాదేవీలు ఉన్నాయి. చంద్రబాబు ఆడియో కూడా ఉంది. మరి రాధాకృష్ణ ఆడియోలో ఏమున్నాయి? ఫిర్యాదులున్నాయా? డబ్బులున్నాయా? ధ్రువీకరించే సాక్ష్యాలున్నాయా?
నిజమే.. పాపం పండింది!
జయలలిత ఉదంతంపై కొత్తపలుకులో రాధాకృష్ణ ఓ గొప్పమాట చెప్పాడు. పాపం ఎప్పటికైనా పండుతుందని. నిజమే పచ్చమూక పాపం పండింది. పెద్దాయనను మొత్తుకోంగ సీటునుంచి గొరగొర గుంజేసిన పాపం ఇప్పటికి పండింది. రాత్రికి రాత్రి బస్సులు పెట్టి తెలంగాణ ఆపి వందల మంది యువకులను పొట్టనబెట్టుకున్న పాపం పండింది. బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని డబ్బుల మూటలతో అపహాస్యం చేయడానికి యత్నించిన పాపం పండింది. కరెంటు ఫీజులు పీకి రైతుల ఉసురు తీసిన పాపం పండింది. మీడియా మాఫియా అండతో తెలంగాణ సర్కారు మీద కుట్రలు చేసిన పాపం సంపూర్ణంగా పండింది. దుష్ట సంహారం ఇపుడే ప్రారంభమైంది. ఇక్కడితో ఆగదు. అమరుల ఉసురు ఊరకేపోదు! చంచల్‌గూడలో కంచాలు కడగడానికి కాలం ఆసన్నమైంది.. రాధాకృష్ణ ఇది గుర్తించుకోవాలి.