-సీఎం కేసీఆర్ మార్గదర్శకం దేశానికి అవసరం
-మన పథకాలను కాపీ కొడుతున్న ఇతర రాష్ట్రాలు
-16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్‌వే
-ఖమ్మం టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్నది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో నాయకులు ప్రచారంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన మీరు ఎందుకు పార్టీ వీడాల్సి వచ్చింది?
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుద్వారా తేల్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. టీడీపీకి భవిష్యత్ లేదు. అది ఆంధ్రాపార్టీగానే మిగిలిపోతున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నా.
ఖమ్మం ఎంపీ సీటుకు మిమ్మల్ని ఖరారు చేయడం వెనుక లక్ష్యం ఏమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా పనితీరు తెలుసు. 15వ లోక్‌సభలో సీఎం కేసీఆర్, నేను పార్లమెంట్ సభ్యులుగానే ఉన్నాం. నేను పార్లమెంటరీ పార్టీ నేతగా అనేక సమస్యలపై మాట్లాడిన విషయాలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో చర్చకు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నాకు 2014 ఎన్నికల్లోనే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే, కొన్ని కారణాల రీత్యా నేను పార్టీలోకి రాలేకపోయా. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తా.
ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?
తెలంగాణలో ప్రతిపక్షం అనేదే లేదు. అంతా స్వపక్షమే. ఈ పరిస్థితుల్లో జరుగబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 16 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయం. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. 16 సీట్లను గెలువడం ద్వారా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ర్టానికి సంబంధించిన నిధులను రాబట్టుకోవచ్చు. తద్వారా తెలంగాణ అభివృద్ధిని మరింత సాధించగలం. ప్రజలంతా తమ ఓటు ద్వారా కేసీఆర్ పాలనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
ఎంపీగా గెలిస్తే మీ విజన్ ఏమిటి?
ఖమ్మం బిడ్డగా జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నది. 20 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం అవసరమో నాకు తెలుసు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తా. ముఖ్యంగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు జిల్లా ప్రజలందరికీ చేరేలా చేస్తా. ముఖ్యంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తా.
టీఆర్‌ఎస్ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతారు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాను టీఆర్‌ఎస్ గడ్డగా తయారు చేస్తాం. జిల్లాలోని అందరు నాయకులను కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తాం. టీడీపీలోని క్యాడర్ మొత్తం టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వలసలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ ఎదిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్ బలమేమిటో నిరూపించాయి.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని ఏలాయి. అయినా, ప్రజల సమస్యలు తీరకపోగా అనేక ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రత్యామ్నాయం దేశానికి అవసరం. అది కూడా కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడి వల్లే సాధ్యం. ఇవాళ తెలంగాణలోని వనరులను ఏ విధంగానైతే సద్వినియోగం చేసుకొని ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆయన అందిస్తున్నారో రేపు దేశంలో కూడా అదే సాకారమవుతుంది.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన పట్ల ఎలా ఉన్నారు?
తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలూ కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారు. సీఎం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ప్రజలు ఏ విధమైన లబ్ధి పొందారో వారు తమ ఓట్లద్వారా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తీర్పు నిచ్చారు. 88 మంది ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించడం అంటే ప్రజలకు కేసీఆర్ పాలనపై ఎంత నమ్మకముందో అర్థమవుతున్నది. కేసీఆర్ దూరదృష్టి గల గొప్ప నాయకుడు. ఆయన పథకాలను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పేర్లు మార్చి కాపీ కొడుతున్నాయి.
source: namaste telangana