mt_logo

నల్లగొండలో 7600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం..

తెలంగాణ విద్యుత్ కష్టాలను తొలగించే క్రమంలో నల్లగొండ జిల్లాలో 7600 మెగావాట్ల సామర్ధ్యంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించి సుమారు 7500 ఎకరాల అటవీ భూమిలో రూ. 55 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ప్రాజెక్టును నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జెన్ కో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.

విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఎన్టీపీసీ నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. అయితే ఇందులో 1600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టును కరీంనగర్ జిల్లా రామగుండం వద్ద ఎన్టీపీసీ ఇప్పటికే పనులు చేపట్టింది. మిగతా 2,400 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్రాజెక్టును నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నెలకొల్పడానికి ఎన్టీపీసీకి భూములు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిన్న జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.

అదేవిధంగా తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో కొత్తగా 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో ఉన్న రామానుజులపల్లిలో బీహెచ్ఈఎల్ 1080 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు పనులను చేపట్టింది. మిగతా 5000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు దామరచర్ల మండల భూములు అనుకూలమైనవని సీఎం నిర్ణయించారు.

సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం సిమెంట్ పరిశ్రమలు, రైస్ మిల్లులు మాత్రమే ఉండగా ఇప్పుడు సీఎం నిర్ణయంతో భారీ స్థాయిలో 7600 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుందని, దీనితో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ ఒక్క రోజులోనే భూములు పరిశీలించి 7600 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి శాశ్వతంగా రుణపడిఉంటామని, ఈ ప్రాజెక్టు వల్ల వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *