- కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ రాజకీయంగా బాగుపడిన చరిత్ర లేదు
- నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తి నీతి ముచ్చట్లు చెప్తుండు
కేసీఆర్‌పై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం మంత్రి కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్లతో హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను, ఉప్పల్ చౌరస్తాలో రూ.25 కోట్లతో హెచ్‌ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక మున్సిపల్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు.
తెలంగాణలో పర్యటించిన భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడారు. ఆయన చేసిన ఆరోపణల్లో ఏమైనా అర్థముందా.. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామని అంటున్నరు. ఎందుకు? పేదలందరికీ పింఛన్లు, 12 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇస్తున్నందుకా? 13 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించినందుకా? ఐటీ సంస్థలు తీసుకొస్తున్నందుకా? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతవ్? అని నడ్డాను నిలదీశారు.తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకే నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడటానికి ఓ హద్దు, అదుపు ఉండాలని, కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ రాజకీయంగా బాగుపడిన చరిత్ర లేదని మంత్రి మండిపడ్డారు.
అవినీతిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడితే.. పులి శాఖాహారం, హంతకుడు సంతాపం తెలిపినట్టు ఉంటుందని అన్నారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా? అని అడిగారు. అమరులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కార్చుతున్నదని, చంపినోడే వచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అమరవీరుల స్మారక స్థూపం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఆ అర్హత వారికి ఏ మాత్రం లేదు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ నేతల నాన్చుడు ధోరణి కారణంగానే కదా!.. దాదాపు 1200 మంది తెలంగాణ యువకులు, ఉద్యమకారులు ప్రాణాలు తీసుకున్నారు. వీరి త్యాగాలకు బాధ్యులెవరు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.