mt_logo

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

  • కాళేశ్వరంకు 86 పైసలు కూడా కేంద్రం ఇవ్వలే..  ఎంపీ రవిచంద్ర
  • కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు
  • రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా.. 
  • బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది

సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడారు. అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పరుస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.లోకసభలో బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలు మాట్లాడిన తీరు పట్ల ఆయన  అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బలంగా తిప్పికొట్టారు.

ఢిల్లీ లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయిందని, ఈ విషయంలో రేవంత్ అర్థంపర్థం లేని నిరాధార ఆరోపణలకు దిగడం శోచనీయమన్నారు.ఎంపీ రవిచంద్ర ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు తదితర ఎంపీలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా, ఏ మాత్రం సహకరించనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అద్భుతమైనదని, కేంద్ర ప్రభుత్వం దీనికి 86పైసల సాయం కూడా చేయలేదని ఎంపీ వద్దిరాజు సుస్పష్టంగా చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నిండు లోకసభలో అబద్ధం చెప్పడం అభ్యంతరకరమన్నారు.

సంవత్సరం పైగా అధికార బీజేపీ పార్లమెంట్ నడవకుండా,దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా తప్పించుకుంటున్నదని ఆయన నిశితంగా దుయ్యబట్టారు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, అదానీ ఆర్థిక కుంభకోణాల గురించి చర్చించకుండా 50 లక్షల కోట్ల జాతీయ బడ్జెట్ ను ఆమోదింపజేసుకున్న తీరును  ఈ సందర్భంగా రవిచంద్ర గుర్తుచేశారు. అలాగే, ప్రస్తుత సమావేశాలలో మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న కల్లోల పరిస్థితులపై చర్చ జరుగకుండా, సభలో సమాధానం ఇవ్వకుండా అధికార పక్షం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పరుస్తున్నదని ఎంపీ వద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.