mt_logo

ఆంధ్రా నాణానికి టీడీపీ, బీజేపీ బొమ్మాబొరుసూ- కవిత

బుధవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో లోక్ సభ ఉప ఎన్నిక ప్రచార సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రా నాణెమేనని, దానికి టీడీపీ, బీజేపీలు బొమ్మాబొరుసులా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ నుండి పార్లమెంట్ లో 11 మంది ఎంపీలం ఉన్నామని, తెలంగాణ సమస్యలపై నిత్యం ఉద్యమిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఆంధ్రాకు మాత్రం రూ. 8 వేల కోట్లు నిధులను కేటాయించడంతో పాటు, పది ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించారని ఆరోపించారు.

తెలంగాణలో రెండేళ్లుగా పంటలు నష్టపోతే పరిహారం ఇవ్వాలని కోరినా, రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడం లేదనే సాకులతో కాలయాపన చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా, కేంద్రం నేటికీ కనీస సహకారం అందించలేదని కవిత పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఏనాడూ రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలను ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఆమె అన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరుగుతుందని, విపక్షాలకు గుణపాఠం అవుతుందని కవిత అన్నారు.

అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజాసేవతోనే నాయకులు ఉన్నతంగా రాణిస్తారని, కానీ కొందరు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ టీడీపీ నేతలు ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగుతూ వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రసమయి బాలకిషన్, అభ్యర్థి పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *