mt_logo

హోదా కోసం బలవన్మరణాలు వద్దు- ఎంపీ కవిత

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి 14నెలలైనా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నాయని, అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఒకే దృష్టితో చూడాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని ఎంపీ కే కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సుబ్రా ముఖర్జీ ఇటీవల మరణించిన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఆయన కుమారుడు, ఎంపీ అభిజిత్ ముఖర్జీని పరామర్శించారు. అనంతరం కవిత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ. 1.25 లక్షల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను మాత్రం ఇప్పటివరకూ పట్టించుకోలేదని అన్నారు. రాజకీయ పొత్తు ధర్మం పాటిస్తారో? లేక ప్రజాసంక్షేమాన్ని పాటిస్తారో ప్రధాని మోడీ తేల్చుకోవాలని, దీనిపై  ఆయన పునరాలోచన చేయాలని కవిత స్పష్టం చేశారు.

ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైకోర్టు విభజన, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్ధికసాయం, ఇలా అనేక అంశాల్లో కేంద్రం నుండి కదలిక రాలేదని, ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి అన్యాయమే జరుగుతున్నదని, దీనిపై రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా నిలదీయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కవిత సూచించారు. ఏపీకి ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలు చేయడంలేదని, ఆ రాష్ట్ర ప్రజలు మనోధైర్యం కోల్పోవద్దని, హక్కులను సాధించే దిశగా పోరాడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతోమంది యువత ప్రాణాలర్పించారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా డిమాండ్ తో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయని, కొట్లాడడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఏపీ ప్రజలకు కవిత సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాల్లోని బాధ తనకు తెలుసని, తెలంగాణ తల్లులు పడిన బాధను ఇప్పుడు ఏపీలోని ఎందరో తల్లుల్లో చూస్తున్నానని, ఒక మహిళగా తాను ఆ బాధలను అర్ధం చేసుకోగలనని అన్నారు.

రెండు రాష్ట్రాల పట్ల ప్రధాని మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఏపీ సీఎం చంద్రబాబు ఎండగట్టాలని కవిత కోరారు. ఎన్డీయే కూటమిలో ఉన్నందున చంద్రబాబు మౌనంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రాన్ని నిలదీయకపోవడం ఆ రాష్ట్రానికి శాపంగా మారుతున్నదని కవిత పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో సమస్యల పరిష్కారానికి సిద్ధంగా లేరని విమర్శించారు. గతంలోనే అనుమతి పొందిన పాలమూరు పథకాన్ని అడ్డుకునేందుకు కేంద్రానికి ఫిర్యాదు చేశారని, సొంత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఆయన తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఇబ్బంది పెట్టాలనుకుంటే నష్టపోయేది ఆయనేనని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ లో కీలకమైన నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని, ఎంతకైనా కొట్లాడుతామని, భయపడే ప్రసక్తే లేదని కవిత తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *