తెలంగాణలో ఇళ్ళు లేని నిరుపేదలకు రెండు బెడ్ రూమ్ ల ఇళ్ళను నిర్మించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అందరికీ ఇళ్ళు) పథకానికి తొలిదశలో తెలంగాణ సహా దేశంలోని 9 రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 305 నగరాలు, పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేదలకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తారు. తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాల్లో పేదలకు ఈ పథకం ద్వారా ఇళ్ళు నిర్మించి ఇస్తారు. ఈ విషయమై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన(హెచ్ యూపీఏ) శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు.
కేంద్రప్రభుత్వం ఈ పథకం కింద ఒక్కో ఇంటికి సుమారు రూ. 1లక్ష నుండి రూ. 2.30 లక్షల ఆర్ధికసాయం అందజేస్తుంది. ఇదిలావుండగా తెలంగాణ నుండి హైదరాబాద్, వరంగల్ స్మార్ట్ సిటీలుగా, 11 నగరాలు అమృత్ నగరాలుగా ఎంపికైన విషయం తెలిసిందే. సిద్ధిపేట విషయంలో కేంద్రం నుండి ఇంకా అమృత్ ప్రకటన అధికారికంగా వెలువడనందున రాష్ట్రం నుండి 10 మాత్రమే అమృత్ నగరాలు మంజూరైనట్లు భావించాల్సి ఉంటుంది. అందరికీ ఇళ్ళు పథకాన్ని అమలుచేసేందుకు కేంద్రంతో 15 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోగా, వీటిలో మొదటగా 9 రాష్ట్రాలో పథకం అమలుకోసం పట్టణాలు, నగరాలను ఎంపికచేశారు.