గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి, అత్యంత ప్రజాదరణ పొందాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 259 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, మరో 131 బస్తీ దవాఖానలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వీటిని ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ… ఇప్పటికే సిద్ధంగా ఉన్న 12 బస్తీ దవాఖానాలను త్వరగా ప్రారంభించాలని చెప్పారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో బస్తీ దవాఖానలపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బస్తీ దవాఖానల్లో అందిస్తున్న సేవలను ఆన్‌లైన్ చేయాలన్నారు. టీ డయాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలని, బస్తీ దవాఖానల్లో టెలీ కన్సల్టేషన్ సేవలు పెంచాలన్నారు. జనాభా సంఖ్యతో పాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీ డయాగ్నొస్టిక్ సహకారంతో బస్తీ దవాఖానల్లో ఎక్కడిక్కడే శాంపిల్స్ సేకరణ జరగాలన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని, మరుసటి రోజు వైద్యుడికి రిపోర్టు చూపించి వైద్యం పొందేలా ఉండాలన్నారు. బస్తీ దవాఖానలు, టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల వల్ల ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలకు తోడు మందులను ఉచితంగా ఇస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తప్పడమే కాకుండా, ఎంతో ఉపయోగంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.