mt_logo

ఆదరించండి.. ఆశీర్వదించండి : ఎమ్మెల్సీ కవిత

  • ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం.. ఇతర పార్టీలది ఓటు బంధం
  • ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేసీఆర్ కావాలా.. నిరుద్యోగులను చేసే కాంగ్రెస్ కావాలా..
  • కంటి వెలుగు ఇచ్చే కేసీఆర్ కావాలా..?
  • కరెంటు కోతలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..?
  • దశాబ్దాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, పేద ప్రజలకు ఏం చేసిందో రాహుల్ గాంధీ చెప్పాలి- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి- ఎమ్మెల్సీ కవిత

24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా, 3 గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా… ప్రజలంతా ఆలోచించి, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ యాత్ర ప్రారంభించారని.. వెయ్యి ఎలుకలను కొట్టిన పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 62 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, పేదలకు, ముస్లింలకు ఏం చేసిందని విమర్శించారు. పేదలను దూరం పెట్టారు తప్ప, పేదరికాన్ని రూపుమాపలేదని కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే వేయాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 750 కంటే పెన్షన్ ఇవ్వడం లేదని, కానీ తెలంగాణలో రూ.4,000 పెన్షన్ ఇస్తామని అబద్దాలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఏఆర్ఆర్ గార్డెన్ నుంచి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రగా ముందుకు కదిలారు. అనంతరం చక్కర్ నగర్ NSF గ్రాండ్ ప్రాంగణంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలి

బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలిరావడం చూస్తుంటే, ఎమ్మెల్యే షకీల్ విజయ యాత్రలా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. వేల మంది రోడ్ల మీద నడుస్తుంటే కండ్లల్లో నీళ్లు తిరిగాయని, కార్యకర్తలంతా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, కులాలు, మతాల పేరుతో ప్రజలను విడగొట్టకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. భారతదేశంలో కొందరు కులాల పేరుతో విడగొడతారని, తెలంగాణలో మాత్రం ప్రతి కులానికి హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాల కట్టడంతో పాటు, అన్ని కులాల వృత్తులకు ప్రభుత్వం తరుపున సహాయం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలో కొందరు మతాల పేరుతో విడగొట్టారని, కానీ తెలంగాణలో ప్రభుత్వం అన్ని మతాల వారి పండుగలు జరుపుకుంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

బోధన్ ప్రజలకు కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి చేసిందేంటి..?

పదేండ్ల ముందు బీడీ కార్మికులకు పెన్షన్లు రాలేదని, కానీ ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలోనే పది వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత మంచి పనులు ఎవ్వరూ చేయలేదని, వీటి గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి, ఒక్క చెరువును కూడా బాగుచేయలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోధన్ లో 152 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. సుదర్శన్ రెడ్డి పెద్ద వ్యాపారవేత్త అని, షకీల్ మాత్రం సాధారణ కార్యకర్త, బడి పంతులు కొడుకు.. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బోధన్ లో పోటీ సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్య పోటీ ఉందని, ఏది కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు.

ఉద్యోగాలు కల్పించని కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొననివాళ్లు, ఉద్యోగాలు ఇవ్వని వాళ్లు బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారని, ఎన్నికల ముందు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం కొందరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఎంతో మంది కన్ఫ్యూజ్ చేసినా, పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నారని, ఎవరు ఏం చేసారో ప్రజలకు తెలుసని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బోధన్ లో దాదాపు 4,500 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, తెలంగాణ ఏర్పడ్డాక బోధన్ లో రూ.2600 కోట్ల రుణాలు అందించామని గుర్తు చేశారు. దేశంలో కేవలం తెలంగాణలోనే 1.30 లక్షల ఉద్యోగాల భర్తీని ప్రకటించామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయలేదని ఎమ్మెల్సీ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో ప్రైవేటు రంగంలో దాదాపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభించిన రోజే 250 మందికి ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఆగస్టు 29న నిజామాబాద్ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి, ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు 52 జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. గతంలో ఏనాడైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నించారా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ప్రజలతో పేగుబంధం ఉన్న పార్టీ బీఆర్ఎస్

బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, ప్రజలతో పేగుబంధం ఉన్న పార్టీ అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇతర పార్టీలకు ప్రజలు ఈవీఎంల లాగా కనపడతారన్న ఎమ్మెల్సీ కవిత, కానీ బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సభ్యుల లాగా కనపడుతరాని తెలిపారు. మనది పేగు బంధమని, ఇతర పార్టీలది ఓటు బంధం అని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు, రైతులందరికీ పెండింగ్ రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలో 35 లక్షల రైతులకు 35 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలంతా రైతుల దగ్గరికి వెళ్లి, రైతుబంధు, రుణమాఫీ గురించి వివరించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కాంగ్రెస్ నాయకులు తిరగబడదాం- తరిమికొడదాం అంటూ కార్యక్రమం నిర్వహించారన్న, గులాబీ కార్యకర్తలు తిరగబడితే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేరన్నారు. గతంలో తెలంగాణ రాదని అనేక మంది కేసీఆర్ ను మాటలు అన్నారని, అయినా తెలంగాణ సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆనాడు తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉంటే, నేడు వడ్లు పండించడంలో అగ్రస్థానంలో ఉన్నామని, త్వరలో పంజాబ్ ను దాటేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

కేసీఆర్ వెంటే ముస్లింలు

తెలంగాణలోని ముస్లింలంతా కారు-కేసీఆర్- సర్కార్ తప్ప మరో విధంగా ఆలోచించడం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో మతాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగలేదని, దేశమంతా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ముస్లిం నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్రం తెలంగాణ అని, ముస్లిం నాయుడిని, హోం మంత్రి, రెవెన్యూ మంత్రిగా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో షకీల్ ను ఎమ్మెల్యేగా మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత నియోజకవర్గ ప్రజలను కోరారు.