mt_logo

దేశానికి ఆదర్శంగా తెలంగాణ మిషన్ భగీరథ: ప్రొబేషనరీ ఐఏఎస్‌ల బృందం

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మానసపుత్రికగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెకు ఈ పథకం ద్వారా పైపు లైనుల ద్వారా తాగునీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చటం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా అందిస్తున్న స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీటితో నల్గొండ జిల్లాను పట్టిపీడించిన ఫ్లోరైడ్ రక్కసిని నిర్మూలించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం.

మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ 2019 అవార్డు కింద ప్రథమ బహుమతి లభించడం తో పాటు రెండు లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందిస్తున్నందుకు గాను జల్ జీవన్ అవార్డ్స్ 2022 కింద ప్రథమ బహుమతి లభించింది. వీటితో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులను మిషన్ భగీరథ పథకం సాధించింది.  ఈ నేపథ్యంలోనే..  మిషన్‌ భగీరథ  తక్కువ ఖర్చుతో  ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన గొప్ప ప్రాజెక్ట్  అని ప్రొబేషనరీ ఐఏఎస్‌లు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో శిక్షణ పొందుతున్న 5 గురు ఐఏఎస్‌లు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కోమటిబండలోని మిషన్‌ భగీరథ పథకాన్ని సందర్శించారు. 

మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అద్భుతం 

మిషన్‌ భగీరథ ప్లాంట్‌ ఏర్పాటు లక్ష్యం, రూపకల్పన, నీటి సేకరణ, శుద్ధీకరణ, నీటి సరఫరా తదితర వివరాలను ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఈ ఈ రాజయ్య, ఐఏఎస్‌ అధికారులకు వివరించారు. ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకున్న అనంతరం ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శారదశుక్ల, కిరణ్మయి కొప్పిశెట్టి, వికాస్‌ మెహతా, ఉమాశంకర్‌ ప్రసాద్‌, మయోంక్‌ సింగ్‌ భగీరథ పథకం అద్భుతమని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట సాధ్యం కాదనుకున్న పథకాన్ని చేసి చూపడం గొప్ప విషయం అన్నారు. అనంతరం ఈ ఐఏఎస్‌ల బృందంతో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి పలు సందేశాలను, సూచనలను చేశారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన పెంచుకోవాలని, దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ నిర్వహణలో సమర్థవంతంగా రాణించేందుకు ఉపయోగపడుతుందన్నారు.