mt_logo

చైనాలో ముఖ్యమంత్రి బిజీబిజీ..

ప్రపంచ ఆర్ధికఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదటిరోజు బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే దిశగా సీఎం కేసీఆర్ కృషిచేయనున్నారు. మొదటిరోజు జరిగిన సమావేశంలోనే తెలంగాణలో రూ. 1000 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుకొచ్చింది. లియో గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ లియో వాంగ్, ఇతర ప్రతినిధుల బృందంతో సీఎం కేసీఆర్, ఇతర అధికారులు సమావేశమై పెట్టుబడులపై చర్చలు జరిపారు. తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని లియో కంపెనీ చైర్మన్ లియో వాంగ్ తెలిపారు. లియో గ్రూప్ కంపెనీ హెవీ డ్యూటీ పంప్ లు, డిజిటల్ నెట్ వర్క్ కు సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పుతుంది.

ప్రపంచ ఆర్ధికఫోరం సదస్సులో తొలిరోజైన బుధవారం ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్ రోడ్స్ అనే అంశంపై జరిగే చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ అంశంలో వర్ధమాన దేశాల మార్కెట్ల అభివృద్ధికి గల అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. లియానింగ్ స్టేట్ లోని టాప్ 30 కంపెనీ సీఈవోలతో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలాంశాలను ఈ సందర్భంగా చర్చించారు. డాలియన్ నగరంలోని పలు ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించారు.

చైనాలో భారత రాయబారి అశోక్ కే కాంత అక్కడి విశేషాలను ముఖ్యమంత్రి బృందానికి వివరించారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న నూతన పారిశ్రామిక విధానం గురించి తమకు వివరించాలని అనేక కంపెనీల నుండి సీఎం బృందానికి ఆహ్వానాలు అందుతున్నాయి. చైనాలోని పలు ప్రాంతాలు, సంస్థలు, అసోసియేషన్ల నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, షెంజెన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జియాండే యె నుండి సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. షెంజెన్ నగరంలోని పలు కంపెనీలు భారత్ లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాయని, ఈనెల 14న సీఎం కేసీఆర్, ఇతర అధికారుల బృందం షెంజెన్ ను సందర్శించాలని లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *