mt_logo

కాంగ్రెస్, బీజేపీ నేతలవి బేకార్ మాటలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్
  • కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ… నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది
  • నేడు అంక్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ నుంచి సుమారు 40 మంది యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 
  • – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూరు: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం  లక్కోర గ్రామం ఏఎన్జి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. మధు శేఖర్,డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డా. భాస్కర్ యాదవ్,కోటపాటి నర్సింహ నాయుడు స్థానిక మండల నాయకులు, ప్రజాప్రతినిధుల, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్దినీ పలువురు వక్తలు ఈ సందర్బంగా కార్యకర్తలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రశాంత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతీ బిఆర్ఎస్ సైనికుడు కంకణబద్దులై పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి వేముల మాట్లాడుతూ…కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ… నేడు దేశానికే ఆదర్శమయ్యింది అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ అయ్యిందని దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. 

పదిలంగా ఉన్న తెలంగాణను తెలిసి పాడు చేసుకుంటామా? ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్,బీజేపీ నేతలవి బేకార్ మాటలనీ, వాళ్ళు ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైన చెప్తరు… ఓట్లు డబ్బులు పడ్డాక మొహం కూడా చూపించరనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో ప్రజలను పట్టించుకోని వారు.. నేడు అదే ప్రజలను ఓట్లు అడగడానికి వస్తూ.. అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కర్ణాటక లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన పాపానికి రైతులు కరెంట్ లేక గోస పడుతున్నారని, తెలంగాణ రైతులు మోసపోవద్దని అక్కడి రైతులు ఇక్కడికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మరీ చెప్తున్నారని గుర్తు చేశారు.

23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న

23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న కుటుంబం నాదనీ,ఎన్నడూ పదవుల కోసం పక్కకు చూడలేదని మంత్రి వేముల భావోద్వేగానికి లోనయ్యారు. గత 23 ఏళ్లుగా సీఎం కేసీఆర్ మాట జవదాటకుండా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నామని, తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు పార్టీ కోసం ,ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. 23 ఏళ్లుగా పార్టీ కోసం కేసిఆర్ గారి ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టే కేసీఆర్ కు తాను అంటే ఇష్టమన్నారు. అందుకే కేసీఆర్ గారి దయ వల్ల అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులు సాధ్యం చేసుకున్నామన్నారు. తాను ఈ ప్రాంతానికి చేస్తున్న మంచి తనకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని, ప్రశాంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు. నేను పుట్టిన ఈ వేల్పూర్ గడ్డ నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నదనీ,రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు చూపించే ప్రేమే కారణమన్నారు. మీరిచ్చే ధైర్యం చూస్తుంటే..మూడో సారి భారీ మెజార్టీతో గెలుస్తా అనే ధీమా ఉన్నదనీ, ప్రజల ఆశీర్వాదం ,కార్యకర్తల అండ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్‌దే విజయమన్నారు.

బీఆర్ఎస్ సూపర్,డూపర్ మేనిఫెస్టో కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి

వేల్పూరు మండలం లో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధి దారులు 26600 మంది ఉన్నారన్నారు. ఈ మండలంలో  యావరేజ్ గా పోలయ్యే ఓట్లు 25 వేలు ఉంటాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రతి లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలనీ చెప్పారు. బీఆర్ఎస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని,బిఅర్ఎస్ పై ప్రజల కు ప్రేమ అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచాలని పిలుపునిచ్చారు.

వేల్పూర్ మండలంలో 10,200 మందికి పెన్షన్‌లు ఇచ్చాము

11667 రైతు బంధు ఇచ్చామనీ, 1731మందికి సీఎం అర్ ఎఫ్,900 మందికి గృహలక్ష్మి ఇచ్చాము. 206 కుల సంఘాలకు 9 కోట్ల నిధులు ఇచ్చాము. 31 ఆలయాలకు ,32 మజీద్ చర్చి లకు కోట్లాది నిధులు ఇచ్చామనీ అన్నారు. వారందరితో ఓట్లు వేయించాలని ఒక్కో కార్యకర్త 10 ఓట్లు వేయించాలని సూచించారు. ప్రపంచంలో రైతు బీమా వంటి బీమా ఎక్కడ లేదు,భూమి లేని పేద వారికి కూడా కేసీఆర్ బీమాతో ధీమా ఇస్తున్నారని, 3వేల రు. సౌభాగ్య లక్ష్మి పేద ఆడపడుచులకు వరమన్నారు. రూ.400 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తారని, 2 వేలు ఉన్న పెన్షన్ ఐదేళ్లలో 5 వేలకు పెంపు చేస్తామని అన్నారు.ప్రతి పేద కుటుంబానికి సన్న రేషన్ బియ్యం.

ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు,రైతు బంధు ఐదేళ్లలో 16 వేలకు పెంపు ఇవన్నీ ప్రద ప్రజల సంక్షేమం కోసం పెట్టినవే అని అన్నారు.ఈ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుక వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉందన్నారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలుచేసిన  వికలాంగ కుటుంబాలకు, కుల సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల మద్యన చిన్న చిన్న విభేదాలు ఉంటే కేసీఆర్ కోసం,తన కోసం పక్కన పెట్టి గెలుపు కోసం పనిచేయాలిని మంత్రి వేముల విజ్ఞప్తి చేశారు.