బహదూర్‌పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ నుండి పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్‌నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని ఇండ్లు పంపిణీ చేశారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని తెలిపారు.
పేదలపై ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు సహాయం అందజేసి ఇరుకైన ఇండ్లను నిర్మించింది. మొదటి విడతలో రాని వారు ఆందోళన చెందవద్దని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తాం అని అన్నారు.
మొదటి విడతలో 11, 700 మందికి ఇండ్ల పంపిణీ చేస్తున్నాం, జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో లక్ష ఇండ్ల నిర్మాణం జరిగింది. దశల వారీగా ఇండ్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. కొందరు దుర్మార్గులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వారి మాటలు నమ్మొద్దని సూచించారు.