mt_logo

కొల్లూరులో 3500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి: తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ జరిగింది. జీహెచ్ఎంసీ  పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 

మాటలు కోటలు.. చేతలు పకోడిలా.. 

డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతమైంది,  విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.  కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయి పని చేయవని అన్నారు. 

బీజేపీ వాళ్ళకి మాటలు ఎక్కువ…చేతలు తక్కువ, మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయి. హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తాం. ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు. 

ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు.   హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్, ఆలయం, చర్చి, మసీదు కూడా ఏర్పాటు చేస్తాం. ఫంక్షన్ హాల్లు నిర్మిస్తాం. బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుందన్నారు. 

బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్

బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు బండి పొతే బండి ఇస్తామన్నారు.  బండి పోతే బండి గుండు పోతే గుండు అన్నారు..బండి లేదు గుండు లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ లో ఎక్కడైనా డబుల్ డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారా?  వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండని తెలిపారు. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్‌ని ఆశీర్వదించండని అన్నారు.