జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం, చెన్నాపూర్ గ్రామం నుండి చెంచుపల్లి వరకు 1 కోటి 66 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ సర్కారే వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోయి రైతులకు సీఎం కేసీఆర్ అనవసరంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో రేవంత్ ఉన్నప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కరెంట్ 6 నుంచి 9 గంటలు మాత్రమే అని గుర్తు చేసారు.
రేవంత్ రెడ్డిది నాలుకా? తాటి మట్టా..?
కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే కరెంట్ సరిపోలేదు అని ధర్నా చేసిన రేవంత్ ఈ రోజు 3 గంటల విద్యుత్ చాలు అనడం సిగ్గు చేటన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి రాగానే వ్యవసాయానికి మూడు గంటలు విద్యుత్ చాలని అంటున్న రేవంత్ రెడ్డిది నాలుక తాటి మట్ట అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరంలో నాణ్యమైన 24 గంటకు విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ గారిదే అన్నారు. అధికారంలోకి రావడానికి అనవసరపు వాగ్దానాలు చేస్తున్న పార్టీల నాయకులను ప్రజలు ప్రశ్నించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.
రైతును రాజు చేసింది సీఎం కేసీఆర్
కేసీఆర్ హయాంలో జనరేటర్లు మూలన పడ్డాయి, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి ఒక రైతు, రైతులకు కష్టాలు లేకుండా రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజు చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణను అనుసరిస్తున్నాయి. భారతదేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లతో పాటు ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. ఆడపిల్లల పెళ్లి అంటే సొంత మేనమామే మొహం చాటే పరిస్థితి నుండి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ కల్యాణలక్ష్మి ద్వారా అండగా నిలుస్తోంది.
కరోనా కాలంలో రైతు బంధు ఇచ్చిన ఘనత ఆయనదే..
75 ఏళ్లు ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తండ్రి మనసుతో ఆలోచించే, రైతు నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టం. ఒకే రోజు దాదాపు 3 కోట్ల పై చిలుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మీరు ఒకరికి ఓటు వేస్తే ముగ్గురు పనిచేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ రోడ్లకు మా శాఖ నుంచి 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగులకు, ఎమ్మెల్యే మంత్రులకు జీతాలు ఆపి రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ఏ అని అన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆగదని చెప్పింది సీఎం కేసీఆర్ అని గుర్తు చేసారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దాదాపు 100 కోట్ల అభివృద్ధి చేశారు. గతంలో అనారోగ్యంతో ఉంటే MGM దవాఖానకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ప్రతి జిల్లాకు ఒక 100 పడకల దవాఖాన అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.