- హైదరాబాద్ నగర పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష
- ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆదేశం
- హైదరాబాద్ నగర పారిశుధ్యంపై సమీక్ష నిర్వహించిన మంత్రి
భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కె. తారక రామారావు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నానక్ రామ్ గూడా లోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జీహెచ్ఎంసీ మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రానున్న రెండు మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఈ మేరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా అధికారులు వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల వలన ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ నగర పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఈ సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుందని అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుద్ధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆ దిశగా పని చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.