mt_logo

ఒకనాడు పల్లేర్లు మొలిచిన పాలమూరులో నేడు పాలనురగల జలహేల: మంత్రి కేటీఆర్

నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఎన్నో ఆటంకాలను ఎదురుకొని నేడు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో సగర్వంగా ప్రారభించుకోబోతున్న సందర్బంగా..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు.

ఈరోజు తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ.. పల్లేర్లు మొలిచిన పాలమూరులో.. పాల నురగల జలహేల!, వలసల వలపోతల గడ్డపైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుంది. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో .. కృష్ణమ్మ జల తాండవం జరగనుంది అని అన్నారు.

శెలిమలే దిక్కైన కాడ, ఉద్దండ జలాశయాలు.. బాయి మీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు.. స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం నేడు చూడబోతున్నాం అని పేర్కొన్నారు.

ఆరు జిల్లాలు సస్యశ్యామలం అవుతూ.. దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం జరగబోతుంది. నిన్న పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్, నేడు సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్నాడు అని అన్నారు. నాడు నది పక్కన నేల ఎడారిలా ఎండిన విషాదం, ఇది సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం. బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను
బీడు భూములకు రప్పించేందుకు, స్వయం పాలనలో సాహస యజ్ఞం అని అన్నారు.

ఇదే, ఆటంకాలు అవరోధాలు అధిగమించి.. ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి, సవాల్ చేసి సాధించిన విజయం ఇది. నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం, అనుమతుల్లో అంతులేని జాప్యమైనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం అని పేర్కొన్నారు. తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత అని మంత్రి తన అభిప్రాయాన్ని తెలిపారు.