mt_logo

తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం : మంత్రి కేటీఆర్ 

ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. సమావేశంలో మంత్రి కే. తారక రామారావు మాట్లాడుతూ.. వలసల జిల్లాగా పేరొంది, ఒకనాడు పడావు పడ్డ పాలమూరు జిల్లాను ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పచ్చగా చేస్తుందన్నారు.  ప్రతి ఏటా లక్షల మంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది. కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది. గోదావరిలో కాళేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టింది. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయన్నారు. 

2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల 

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతదేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుంది.  ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనుక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇది. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది.  అనేక అడ్డంకులను దాటుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇది అని తెలిపారు. 

తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా ప్రారంభోత్సవం

రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. 16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.  ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలి.  కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా మంత్రులు చర్చించారు. మంత్రులు సంబంధిత ఎమ్మెల్యేలతో సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకుంటారని పేర్కొన్నారు.