mt_logo

రూ. 18.75 కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

రూ. 18.75 కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1993-96 వరకు ఈ కాలేజీలోనే చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి నా విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వపడతాను. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందన్నారు. ఈరోజు రాష్ట్ర యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ నాలుగవ అత్యుత్తమ స్థానాన్ని సాధించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుంది. 

ఉస్మానియా వీసీ రవీందర్ కూడా యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు. తెలంగాణ TSAT తో ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం ద్వారా మారుతున్న పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యను మరింత మందికి అందజేసేలా ప్రయత్నాలు చేయడం స్వాగతించదగిన విషయం అన్నారు. 

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిజాం కాలేజీ కోసం నిధులు ఇవ్వలేదని గుర్తు చేసారు. నిజాం కాలేజ్ విద్యార్థిగా అయినప్పటికీ ఆయన నిజాం కాలేజ్ కోసం ఒక్క రూపాయి ఇవ్వలేదు. గతంలో డిగ్రీ బాలికల కోసం హాస్టల్ వసతి లేనప్పుడు వెంటనే స్పందించి హాస్టల్ నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 40 కోట్ల 75 లక్షల రూపాయల నిధులు 

విద్యాశాఖకు నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 40 కోట్ల 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు బాయ్స్ హాస్టల్ తో పాటు అదనపు తరగతి గదులు పదింటిని నిర్మాణం చేసుకోబోతున్నాం. 15 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. నిజాం కాలేజీకి ఇంకా పడే అవసరమైతే అదనపు నిధులను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.  నిజాం కాలేజ్ గ్రౌండ్ కి ఇబ్బంది రాకుండా ఈ భవన నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకోసం అదనపు అంతస్తుల్లో భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైతే ప్రత్యేకంగా అనుమతులు ఇస్తాం అన్నారు.  

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడిక్‌మెట్ వరకు రూ. 16 కోట్లతో లింకు రోడ్‌ను వెంటనే మంజూరు చేస్తున్నాం అన్నారు. ఉద్యమ కాలంలో అద్భుత కీలక పాత్ర వహించిన ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకుల పట్ల మాకు ప్రత్యేక గౌరవం ఉంది వారి కోసం ఎంత అవసరమైతే అంత సహాయం చేస్తాం అని హామీ ఇచ్చారు.