బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన “తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం”, “స్కాంగ్రెస్” పుస్తకాలను మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవులు శతకపద్యాలు రాసినట్టు, చిత్రగుప్తుడు మానవుల పాపాల చిట్టా రాసినట్టు కాంగ్రెస్ పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తున్నదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, దేశంలో చేసిన స్కాంలను పుస్తకరూపంలో తీసుకొచ్చిన సోషల్ మీడియా విభాగాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు వై.సతీష్ రెడ్డి, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరి,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.