బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాలలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, నూకపెల్లి వద్ద 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్ బెడ్రూం ఇండ్ల కేసీఆర్ కాలనీని, మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్‌ను హోంమంత్రి మహముద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
జగిత్యాల అభివృద్ధి కోసం సంజయ్ కుమార్ నిరంతరం కష్టపడ్డారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీ జగిత్యాలలో ఉందన్నారు. గత పాలకులు జగిత్యాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు, సీఎం కేసీఆర్ వల్లే జగిత్యాల జిల్లా అయింది, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. జగిత్యాలకు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నామని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ గతం.. ఆ పార్టీ పని ఖతం అన్నారు. రైతులకు నష్టం లేకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్.. మామిడి రైతుల కోసం పెప్సీ, కోకాకోలా లాంటి కంపెనీలను జగిత్యాలకు తీసుకొస్తాం అని అన్నారు.
బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఎట్లుండే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో 5 నిమిషాల కరెంట్ కోసం బతిమిలాడిన రోజులు ఉండేవన్నారు. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్‌కు అండగా ఉండాలని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చినమని చెప్పారు. 60 ఏళ్లు మోసం చేసిన కాంగ్రెస్.. 6 గ్యారెంటీలు అంటూ వస్తున్నది కాంగ్రెస్‌లో పది మంది ముఖ్యమంత్రులు ఉంటారని పేర్కొన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ పరిశ్రమలు ఉన్నాయి కానీ బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ స్పష్టం చేశారు. ముసలి నక్క కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దన్నారు.