mt_logo

‘ఇమేజ్’ లో దూసుకుపోతున్న తెలంగాణ : మంత్రి కేటీఆర్

ఇన్నోవేషన్‌ ఇన్‌ యానిమేషన్‌, మల్టీమీడియా, గేమింగ్‌, అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇమేజ్‌)కు సంబంధించిన అన్ని విభాగాల్లో తెలంగాణ జోరుగా దూసుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మున్ముందు ఈ రంగంలో గొప్ప అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. హెచ్‌ఐసీసీ వేదికగా ఈ నెల 19 వరకు నిర్వహిస్తున్న ‘ఇండియా జాయ్‌’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గేమింగ్‌ రంగంలోనూ తెలంగాణ గణనీయ వృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 గేమింగ్‌ కంపెనీలు ఉన్నాయని, గత రెండేళ్లలోనే 45 కంపెనీలు వచ్చాయని చెప్పారు. హైపర్‌ క్యాజువల్‌ గేమ్స్‌ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని స్ట్రీట్‌ ల్యాబ్స్‌ సంస్థతో ఇజ్రాయెల్‌ కంపెనీ క్రేజీ ల్యాబ్స్‌ ఒప్పందం కుదుర్చుకొన్నదని తెలిపారు. ఓటీటీ గేమింగ్‌కూ ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు.

తెలంగాణ టూ హాలీవుడ్‌ :

హైదరాబాద్‌ యానిమేషన్‌ కంపెనీ గ్రీన్‌ గోల్డ్‌ రూపొందించిన ‘చోటా భీం’ అనేక రికార్డులను కొల్లగొట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేస్తూ.. దేశీయ చిత్ర పరిశ్రమతోపాటు హాలీవుడ్‌కు వీఎఫ్‌ఎక్స్‌ ఔట్‌సోర్సింగ్‌ సేవలు అందించడంలో తెలంగాణ ముఖ్యపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 20 అకాడమీలు, 40కి పైగా ప్రొడక్షన్‌ హౌస్‌లు ఉన్నాయని, వీఎఫ్‌ఎక్స్‌ స్టార్టప్‌ కంపెనీలకు తోడ్పాటునందించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కూడా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరిస్తున్నాయని, దీంతో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. నెట్‌వర్క్‌ సపోర్టుతోపాటు మెంటార్‌షిప్‌ అవకాశం కల్పించడంలో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌ తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఎంఎన్‌సీ కంపెనీలను ఆకర్షించి, ప్రొడక్షన్‌ హౌస్‌లను ఏర్పాటు చేయడంలో ఇక్కడి ఎకోసిస్టం ఎంతో ఉపయోగపడుతున్నదని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *