mt_logo

పీవీ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు: మంత్రి కేటీఆర్

పీవీ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏఎన్ఐతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధానిగా పనిచేసిన నాయకుడికే పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించలేదా..? అని ప్రశ్నించారు.  పీవీ పార్థీవ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా అవమానించిన సంగతిని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. 

దేశ నాయకుడికి ఢిల్లీలో మెమోరియల్ కూడా నిర్మించకుండా అడ్డుకున్నది కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. పీవీ కుటుంబానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంతి ఘనంగా జరిపింది.. గొప్పగా గౌరవించుకుందన్నారు. భారతరత్న ఇవ్వాలని కోరింది..తీర్మానాలు చేసింది. రాహుల్ గాంధీ  ఉద్యమం చేసిండా…ఉద్యోగం చేసిండా..?ఎన్నడూ ఉద్యమం చేయని..ఉద్యోగం చేయని రాహుల్ గాంధీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. 

రాహుల్ ఒక రాజకీయ నిరుద్యోగి.. ఆయన ఉద్యోగం కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నడని పేర్కొన్నారు. డొల్లమాటలు..కల్లబొల్లి కబుర్లు తప్ప చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. కర్ణాటకలో 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాల మాటిచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తొమ్మిదిన్నర ఏండ్లలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్‌దే అన్నారు.    దమ్ముంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు.