mt_logo

రిస్క్ వద్దు కారుకే ఓటు గుద్దు: మంత్రి హరీష్ రావు

నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట. మన మీటింగులకేమో ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండ్రని సంతోషం వ్యక్తం చేసారు. రాని సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో కొట్లాట చూస్తున్నం అని తెలిపారు. కరోనా కాలంలో మన దగ్గర పైసలు లేక రైతు బంధు కుదరదని అధికారులు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ఒప్పుకోలే. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా సరే రైతులకు రైతుబంధు పెట్టాలని కరాఖండీగా చెప్పిండని తెలియజేసారు. 

కాంగ్రెస్‌ని నమ్మి రిస్క్‌లో పడొద్దని హెచ్చరించారు. తర్వాత మమ్మల్ని అడగొద్దు. రిస్క్ వద్దు కారుకు గుద్దు. కాంగ్రెస్ ప్రతీ రైతుకు ఏడాదికి 15 వేలు ఇస్తా అంటుంది. కానీ కేసీఆర్ ఎకరాకు 16 వేలు ఇస్త అన్నడు.  ఎన్నికల కమిషన్ రైతుబంధు నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. సోమవారం పొద్దున చాయి తాగే వరకు మీ ఫోన్లు టింగు టింగుమంటాయని పేర్కొన్నారు. దేవుడు మన తరపున ఉన్నడు. రైతులకు డబ్బులు ఇవ్వడం న్యాయమేనని దీవించిండని అన్నారు. 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వారి సొంత రాష్ట్రంలో గెలిచింది కేవలం రెండు సీట్లే. వారు వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తే మనం మోసపోదామా? అని అడిగారు. సొంత రాష్ట్రంలో ప్రజలు బండకేసి కొట్టిండ్రు. మీరు పనికి రారని అక్కడి ప్రజలు తరిమేసిండ్రుని చెప్పారు.  ప్రజలే హైకమాండ్ అనుకొని కేసీఆర్ పని చేస్తుండు. ఒక్కసారి అని కాంగ్రెస్‌ని నమ్మితే గోస పడుతం. మొత్తం తెలంగాణలో జిల్లా కేంద్రంలో కాకుండా మెడికల్ కాలేజీ ఉన్నది కేవలం నర్సంపేటలోనే అని వెల్లడించారు. నర్సంపేటలో బీఆర్ఎస్ గెలవంగనే నెక్కొండను మున్సిపాలిటీగా జీవో జారీ చేసుకుందాం అని పేర్కొన్నారు.