- హరితహారంతో పచ్చదనం పరిఢవిల్లుతుంది
- ఇప్పటి వరకు 283.82 కోట్ల మొక్కలను నాటాం
- హరిత నిధికి రూ.49.115 కోట్లు సమకూరాయి
- కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించాం
- -శాసన మండలిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హరితహారంపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్… అడిగిన ప్రశ్నలకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి 2015 సంవత్సరంలో బీజం వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, రాజకీయ సంకల్పం, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది.
హరితహార కార్యక్రమం ద్వారా 230 కోట్లు మొక్కలు నాటడమే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 283.82 కోట్లకు మొక్కలు నాటాము. ఇందులో 55.30 కోట్ల మొక్కలను అటవీ పునరుద్దరణలో భాగంగా పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూ. 11,095 కోట్లను వెచ్చించడం జరిగింది. తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 9.02 కోట్ల మొక్కలను నాటాం. రానున్న 2024 సీజన్ లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రమాదకరమైన కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించాము. కొత్తగా ఈ మొక్కలను నాటడం లేదు. ప్రత్యామ్నాయంగా 107 రకాల మొక్కలను రహదారి వనాల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వానలు వాపస్ రావాలె….. కోతులు వాపస్ పోవాలే అనే సీయం కేసీఆర్ నినాదా స్పూర్తితో కోతుల బెడదను నివారించేందుకు నిర్మల్ జిల్లా చించోలి (బి) లో కోతుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, స్టెరిలైజేషన్ చేస్తున్నాం. గ్రామపంచాయతీల నుంచి పట్టుకు వచ్చిన కోతులను అటవీ మార్గంలోని రహదారుల్లో వదిలిపెట్టడం వల్ల అవి మళ్ళీ గ్రామాల్లోకి వస్తున్నాయి. అలా చేయకుండా కోతుల పునరావాస కేంద్రంలో వదిలేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ లోపల, అటవీ బయట విస్తృతంగా పండ్ల మొక్కలను నాటుతున్నామని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 14,864 నర్సరీలను ఏర్పాటు చేసి 30. 02 కోట్ల మొక్కలను పెంచడమైనది. రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కు (పట్టణ ప్రాంత అటవీ ఉద్యనవనాలు) లను ఏర్పాటు చేయడం లక్ష్యం కాగా వాటిలో 73 పార్కులు ప్రజకు అందుబాటులోకి వచ్చాయి. పచ్చదనం పెంపులో భాగంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా రూ.49.115 కోట్లు విరాళాల రూపంలో హరిత నిధికి సమకూరాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తోంది. 2015 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ (ISFR) ప్రకటించింది. అడవుల సంరక్షణతోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి ముడిపడి ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అడవులు, గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నది.
అటవీ ఉత్పత్తులపై ఆధారపడే ఆదివాసీలకు జీవనోపాధి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుంది అంతేకాకుండా 4,205 గిరిజన కుటుంబాల నుండి రూ. 38.44 కోట్ల విలువైన అటవీ ఉత్పత్తులను సేకరించడం జరిగింది. తునికాకు సేకరణదారులకు బోసన్ కూడా చెల్లిస్తున్నాం. నిర్మల్ వద్ద తేనే ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. అంతేకాకుండా సీయం గిరి వికాస్ పథకం క్రింద రూ.126 కోట్ల వ్యయంతో 23,082 గిరిజన రైతులకు చెందిన 66,664. 28 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చామని వివరించారు.