అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. నిజం పలికితే తల వెయ్యి ముక్కలు అవతుందని అమిత్ షాకు ఏదైనా శాపం ఉందేమో? అందుకే ఆదిలాబాద్‌లో పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదనడం పచ్చి అబద్ధమని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లోనే ములుగు మండలంలో రెండు ప్రాంతాల్లో భూములను గుర్తించి కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ బృందం 2017 ఫిబ్రవరి 13న వచ్చి భూములను పరిశశీలించి, ములుగులో భూములు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపకుండా పెండింగ్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు 335.04 ఎకరాలను కేటాయించింది. తాత్కాలిక తరగతుల కోసం ములుగులోని యూత్ ట్రెయినింగ్ సెంటర్ భవనాలను ఇస్తామని చెప్పింది. అయినా కేంద్రం పట్టించుకోలేదని తేల్చి చెప్పారు.
దాదాపు ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్రం ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా ప్రకటన చేసి గొప్పలు చెప్పుకుంటున్నది. కృష్ణా జిలాల్లో వాటా కోసం తెలంగాణ కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ట అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే 2014 జూలై 14న సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ చేపట్టాలని కోరారు. అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ పట్టుబట్టారు. అప్పటి నుంచి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు, కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం అనేక లేఖలు రాసింది. అయినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు.
ఏండ్లు గడుస్తున్నా కేంద్రం మౌనంగా ఉండటంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేసారు. 2020 అక్టోబర్‌లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 2021 జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఇంత చేసినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పడం సిగ్గుచేటు. పిటిషన్ ఉపసంహరించుకొని మూడేండ్లు గడుస్తున్నా కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు. తీరా ఇప్పుడు ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందనడం అమిత్ షా అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.
మీ పరిధిలోని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్ సభలో చెప్పారు. అయినా తెలంగాణను బదనాం చేయడం సిగ్గుపడాల్సిన విషయం. గిరిజనులను ప్రభుత్వం పట్టించుకోలేదంటారా?. 1.51 లక్షల మంది పోడు రైతులకు 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చింది కనిపించలేదా? అని ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్ ను 6 నుంచి 10 శాతానికి పెంచింది తెలియదా? హైదరాబాద్ నడిబొడ్డున కట్టిన ఆత్మ గౌరవ భవనాలు కనిపిస్తలేవా? మా తండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని సాకారం చేస్తూ ఏర్పాటు చేసిన కొత్త గ్రామ పంచాయితీలు కనిపిస్తలేవా? సంత్ సేవాలాల్ వర్ధంతి, జయంతి, కుమ్రం భీం జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న విషయం తెలియదా? అని అడిగారు.
సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ చేపట్టి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తుంటే.. కేంద్రం ఇస్తున్నట్టు అమిత్ షా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు చేస్తోంది. ఒక్కో రైతుకు కేవలం రూ.6వేలు ఇస్తోంది. ఎకరాకు రూ.10వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి.. కేంద్రం ఏదో గొప్పగా ఇస్తున్నట్టు బిల్డప్ ఎందుకు? తెలంగాణకు రాగానే కుటుం పాలన, ఎంఐఎం అంటూ రొడ్డ కొట్టుడు ఉపన్యాసాలు ఇంకా ఎన్నాళ్లు ఇస్తారు? తెలంగాణకు చేసిందేమీ లేదు కాబట్టే.. చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరు. తెలంగాణకు ఎవరు కావాలో ప్రజలకు స్పష్టత ఉందని పేర్కొన్నారు.