mt_logo

23 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా, మహేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. 

బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ

మానవీయ కోణంలో ఆలోచించి సీఎం ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. 23 లక్షల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం.దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 

100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు

సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం విద్య వ్యవస్థలో సమూల మార్పు తెస్తుంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అన్ని పథకాలు సూపర్ హిట్ అన్నారు. సీఎం కేసీఆర్ ఒక పథకం అమలు చేసే ముందు ప్రజా కోణంలో ఆలోచిస్తారు. అందుకే అవి విజయవంతం అవుతున్నాయి. సామాజిక మార్పుకు కారణం అవుతున్నాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కల్యాణలక్ష్మి రూ. 1 లక్ష ఇచ్చే పథకం మాత్రమే కాదు.కళ్యాణ లక్ష్మి బాల్య వివాహాలను తగ్గించింది. చట్టాలు చేయలేనిది పథకం చేసింది. కేసీఆర్ కిట్ 16 వస్తువులు ఇచ్చే పథకం మాత్రమే కాదు, కేసీఆర్ కిట్ వల్ల వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. 

1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

మిషన్ భగీరథ అంటే ఇంటింటికి నల్లాలు మాత్రమే కాదు, మిషన్ భగీరథ వల్ల సురక్షిత తాగునీరు అందుతున్నది. తద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.ఇప్పుడు కేసీఅర్ బ్రేక్ ఫాస్ట్ కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదు, స్కూల్స్ లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, బడి బాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమని అన్నారు. 9,10 తరగతుల విద్యార్థులకు దేశంలో మనం మాత్రమే భోజనం అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబుతున్నాము. 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టం చేసారు. ఆడపిల్లల కోసం ప్రత్యేక విద్యాలయాలు ప్రారంభించాం.దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు అవుతుందని తెలిపారు.