సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్‌లో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించి, 350 మంది గృహ లక్ష్మి లబ్ధిదారులకు పట్టాలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ మాట ఇస్తే, చేసి చూపిస్తాడు. నారాయణ్‌ఖేడ్‌కి ఏం కావాలో చేసి చూపించాడని అన్నారు. మీ రూపాయి ఖర్చు లేకుండా వంద మందిని ఇళ్లల్లోకి పంపారు. కాంగ్రెస్ వాళ్ళవి తప్పుడు ప్రచారం. కర్ణాటకలో అమలు చేసి ఇక్కడ మాట్లాడాలన్నారు. కర్ణాటకలో ఇప్పుడు రూ. 600 పింఛన్ ఇస్తున్నారు. కరెంట్ కోతలు ఉన్నాయి. వికలాంగులకు రూ. 1000, రైతు బంధు రూ. 10 వేలు లేనేలేవని తెలిపారు.
కాంగ్రెస్ వస్తే 6 నెలలకు ఒక కర్ఫ్యూ, 6 గంటల కరెంట్
కాంగ్రెస్ నేతలు ఇక్కడకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి రాని తెలంగాణలో వచ్చి మాట్లాడుతున్నారు. 60 ఏళ్లు కాంగ్రెస్ ఉంటే, ఇక్కడ మార్కెట్ యార్డ్ పెట్టలేదు. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి శంకరం పేట్ ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం.. కాంగ్రెస్ వస్తే 6 గ్యారంటీల అమలు కాదు, 6 నెలలకు సీఎం మారుతాడని ఎద్దేవా చేసారు. 6 నెలలకు ఒక కర్ఫ్యూ, 6 గంటల కరెంట్ మాత్రమే ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ అవుతుంది. వారానికి రెండు పవర్ హాలిడేలు ఉంటాయి. తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరును చేస్తారు. ఢిల్లీ వయా బెంగళూరు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగా అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇచ్చి చూపెట్టారని గుర్తు చేశారు.
తిట్లు కాంగ్రెస్, అయితే కిట్లు కేసీఆర్‌వి
కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉండి పథకాలు అమలు చేయలేదు. కేసీఆర్‌ను మాత్రం తిడుతున్నారు. తిట్లు కాంగ్రెస్, అయితే కిట్లు కేసీఆర్‌వని పేర్కొన్నారు. కిట్లు ఇచ్చే వాళ్ళు కావాలా? తిట్టేవాళ్ళు కావాలా..? అని అడిగారు. నారాయణఖేడ్ ఆసుపత్రి అద్భుతంగా తీర్చిదిద్దాం. ప్రజలకు మంచి సేవలు అందిస్తుంది. కాంగ్రెస్ గ్యారెంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదన్నారు. బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దు. రేపటికి కూడా కేసీఆర్ చాలా చేస్తారు. మన మేనిఫెస్టో త్వరలో వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని పోరాటం చేసి రాష్ట్రం సాధించిండని గుర్తు చేసారు. భూపాల్ రెడ్డి మంచి నాయకుడు. నిత్యం జనంలో ఉండే నాయకుడు. భూపాల్ రెడ్డిని హ్యాట్రిక్ భూపాల్ రెడ్డి చెయ్యాలని అన్నారు.