mt_logo

కాంగ్రెస్‌కు ఓటేసి ఆగమై పోయినమని మొత్తుకుంటున్న కర్ణాటక ప్రజలు: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి, కాంగ్రెస్‌కు ఓటేసి ఆగమై పోయినమని అక్కడి ప్రజలు మొత్తుకుంటున్నరని మంత్రి తెలిపారు. బోధన్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  ప్రజల ఆశీర్వాదంతో బోధన్ లో షకీల్, రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని తేల్చి చెప్పారు. షకీల్ ఎమ్మెల్యే కాకముందు నిజాం సాగర్ చిట్ట చివరి భూములకు నీళ్లు రావాలంటే కష్టంగా ఉండేది. నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కెనాల్ లైనింగ్, ఆధునీకరణ కావాలని అడిగితే వందల కోట్ల రూపాయలను మంజూరు చేశాం అని తెలిపారు. 

కర్ణాటక కాంగ్రెస్ మోడల్ ఫెయిల్ 

కాంగ్రెస్ హయాంలో చేయలేని బోధన్ – నిజామాబాద్ నాలుగు వరుసల రహదారిని రూ. 30 కోట్లతో షకీల్ భాయ్ సాధించారని వెల్లడించారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండని హెచ్చరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ మోడల్ ఫెయిలైంది. ఫ్రీ బస్సు అని చెప్పి బస్సులను ఆపేసిండ్రు. యువ నిధి ఇంకా మొదలే కాలేదు. ఫ్రీ కరెంట్ అని ఊదరకొట్టి రైతులను ఆగం పట్టించిండ్రని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉచితాలకు నిధులు లేక స్కాలర్ షిప్పుల్లో కోత పెట్టిండ్రు. 

కాంగ్రెస్‌లో అర డజను ముఖ్యమంత్రులు 

తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరెంట్ కోతల పాత రోజులు మళ్లీ వస్తాయని సమాజానికి మంచి చేసే పథకాలు కేసీఆర్‌వి అయితే తెలంగాణను ముంచే పథకాలు కాంగ్రెస్ వి అని వివరించారు. కరోనాతో రెండేళ్లు కష్టంగా ఉన్నా ప్రజలను కేసీఆర్ కాపాడుకున్నారు. కాంగ్రెసోళ్లది సుతి లేని సంసారం. అర డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఆ పార్టీలో ఉన్నారు. కుర్చీల కొట్లాట ఎక్కువ ప్రజల పని తక్కువ అని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. అదే నిజమైతే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను బీజేపీకి చెందిన గవర్నర్ ఎందుకు పెండింగులో పెడతారు? అని అడిగారు. కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్‌గానే ఉంటుందని కరాఖండీగా మంత్రి హరీష్ రావు తెలిపారు.