mt_logo

కలలు కనడం.. వాటిని సాకారం చేయడం సీఎం కేసీఆర్‌కు ఉన్న సత్తా: మంత్రి హరీష్ రావు

ఈనెల 23వ తేదీన సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మెదక్‌లో ప్రెస్‌మీట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈనెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభించడానికి వస్తున్నారు అని అన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. మెదక్ జిల్లా అభివృద్ధికి సహకారం అందించి, కలెక్టరేట్ ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సీఎం ఇక్కడికి రావడం సంతోషకరమన్నారు.

జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే సందర్భం ఇదని… ఒక పండుగలాగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులతో సహా, జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తున్నానాని పేర్కొన్నారు.

మా రాష్ట్రాల్లో సచివాలయం కంటే మీ కలెక్టరేట్లు బాగున్నాయి
సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లను అద్భుతంగా నిర్మించారు. మా రాష్ట్రాల్లో సచివాలయం కంటే మీ కలెక్టరేట్లు బాగున్నాయి అని ఇతర రాష్ట్రాల నాయకులు అంటున్నారు. జిల్లాలు కావడం వల్ల జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ఏర్పడడం వల్ల ప్రజలకు మరింత సేవలు చేరువైనాయని అన్నారు. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండటం వల్ల వేగంగా సేవలు అందుతాయని ఉమ్మడి పాలనలో కలెక్టరేట్ల పరిస్థితి దారుణంగా ఉండేది అని అన్నారు.

ఇది కలనా నిజమా..అన్న రీతిలో పనులు
మెదక్‌లో జిల్లా కేంద్రం ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. మెదక్‌కు రైలు తేవడం ఎన్నో ఏళ్ల కల. ఎంతోమంది హామీలు ఇచ్చారు గాని ఎవరూ నెరవేర్చలేదు. ప్రధానమంత్రిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరా గాంధీ ఉండి నెరవేర్చలేక పోయారు. కాంగ్రెస్ మాట తప్పినా.. మెదక్ జిల్లా ప్రజల కలలు సీఎం కేసీఆర్ నెరవేర్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే కలలు కలలుగా గానే ఉంటాయి. కలలు కనడం, సాకారం చేసే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్. ఇది కలనా నిజమా? అన్న రీతిలో పనులు జరుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యం
ఇక్కడి పథకాలు చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు ఆశ్చర్యపోతున్నారు. మెదక్ మెడికల్ కాలేజీ కలను సాకారం చేశారు ముఖ్యమంత్రి గారు. వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యం అని.. ప్రజల్లో బలం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు, బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు. కేసీఆర్‌కు బీఆర్ఎస్‌కు తిరుగులేదని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని పేర్కొన్నారు.