mt_logo

బీజేపీ నాయకులది నిస్సిగ్గు వ్యవహారం : మంత్రి హరీశ్ రావు 

బీజేపీ పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకున్న సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చిందంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఒక్కడేమో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క గుంట తడవలేదు అంటడు, మరొకడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏటీఎం అంటడు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తరు. ఇవాళ ఇంకో ఎంపీ కాళేశ్వరం ప్రాజెక్టు కు 86 వేల కోట్లు మేమే ఇచ్చామని అంటడు. 

రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఆలోచన

పాముకు రెండు నాలుకలు అయితే, అబద్దాల బీజేపీకి మాత్రం పది నాలుకలు. తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఆలోచన ఆ పార్టీ నాయకులది అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తే ఓర్చుకోలేక బీజేపీ ఎంపీలు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గతంలో సోషల్ మీడియాలోనే అబద్దాలు ప్రచారం చేసే ఈ బీజేపీ నేతలు ఇప్పుడు పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ను అవమాన పరుస్తూ మాట్లాడ్డం సిగ్గు చేటు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వని కేంద్రం, ఇవాళ నిసిగ్గుగా మేమే కట్టాం అనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.