కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్‌రావు ఫైర్ అయ్యారు. గాంధీ భవన్‌లో చిదంబరం మాట్లాడిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసిందని గుర్తు చేసారు. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేసారు.
చిదంబరంవి వక్ర భాష్యాలు
పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారం లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. అప్పటి నెహ్రు గారి ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? అని అడిగారు. చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదు .. చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని అన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది.
తెలంగాణ ప్రజలు అమాయకులు కారు
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిదన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని తేల్చి చెప్పారు. కాంగ్రె స్‌కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలని ధ్వజమెత్తారు. తెలంగాణ సాధించింది కేసీఆర్, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్గా నిలిపింది కేసీఆర్ అని స్పష్టం చేసారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నరని ధీమా వ్యక్తం చేసారు.