తెలంగాణ ఏర్పాటులో టీ బీజేపీ పాత్ర శూన్యం. ఉద్యమంలో కీలక నేతలు ఎవ్వరూ పాల్గొనలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేయాలంటే పారిపోయిన నేత ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, ఇతర పార్టీలనుంచి చేరిన అసలు సిసలు ఉద్యమకారులకు బీజేపీలో గౌరవం దక్కడంలేదు. ఈ విషయాన్ని స్వయంగా తన ప్రమాణ స్వీకార సభలోనే అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. పార్టీలో మొదటినుంచి ఉన్నోళ్లకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని, మధ్యలో చేరినవారికి అంటే ఇతర పార్టీల్లోంచి వచ్చిన ఉద్యమకారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పదవులు, ఇతర అవకాశాల్లో ప్రాధాన్యం ఉండదని చెప్పకనే చెప్పారు. ఈ మాటలు విన్న అదే స్టేజీ ఆసీనులైన రఘునందన్‌రావు ముఖం వెలవెలబోయిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్ఎస్ బహిష్కృత నేత ఈటల రాజేందర్‌కు కూడా బీజేపీలో సముచిత గౌరవం దక్కడం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి బైబై చెప్పడం బీజేపీలో ఉద్యమకారులపై ఉన్న వివక్షకు అద్దంపడుతున్నది.
ఉద్యమకారులకు భంగపాటు..
ఇతర పార్టీలనుంచి బీజేపీలో చేరిన ఉద్యమకారులకు భంగపాటు తప్పడం లేదు. ఇప్పటికే రఘునందన్‌రావు, ఈటల తమకు కమలం పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాజాగా, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఓ అడుగు ముందుకేసి బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సమర్పించారు. పార్టీలో కష్టపడి పనిచేసినా ఎవరూ గుర్తించడం లేదని ఆయన వాపోయారు. ఉద్యమకారులంటే చాలా చిన్నచూపు ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు శాశ్వతంగా తప్పుకొంటున్నానని వెల్లడించారు. చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా ఐదుసార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. కాగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు చంద్రశేఖర్‌లాంటి వ్యక్తులు పార్టీకి దూరం కావడమంటే బీజేపీ ప్రజలకు దూరం కావడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.